ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఎలాంటి అవకతవకలు జరగట్లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి (నాకో) మార్గదర్శకాలకు అనుగుణంగానే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నడుస్తోందని దానం తేల్చిచెప్పారు.
బ్లడ్ బ్యాంకులోని రికార్డులతో పాటు రక్తనిధి, సేకరణ, నిల్వ ఏర్పాట్లు, పరికరాల కొనుగోలు ఇతర అంశాలపై నాకో విచారణ జరిపిందని, రక్త సేకరణ, స్క్రీనింగ్ చార్జీల వసూళ్లలో దుర్వినియోగం గానీ నిబంధనల అతిక్రమణలు గానీ లేవని విచారణలో తేలిందని ఆయన వివరించారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై సినీ హీరో రాజశేఖర్, జీవిత దంపతులు తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని చిరంజీవి బావమరిది, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు అల్లు అరవింద్ ముఖ్యమంత్రి కె. రోశయ్యను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై ప్రభుత్వం విచారణ జరిపించింది.
ఈ విచారణలో బ్లడ్ బ్యాంక్‌పై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొంటూ, క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆశించిన పదవులు రాలేదని వాపోతున్న రాజశేఖర్ దంపతులకు మరో షాక్ తగిలింది
0 comments:
Post a Comment