Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Wednesday, October 27, 2010

తెలంగాణ రాదు.. అందుకే కళాతోరణానికి మరమ్మతులు!



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసే ఉద్దేశ్యం లేదని కాంగ్రెస్ అధిష్టానం సూచనప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. ఈ విషయాన్ని సీమాంధ్ర నేత, రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత టి.సుబ్బిరామిరెడ్డికి చెప్పినట్టు వినికిడి. అందుకే ఆయన పది కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఉడతాభక్తిగా ప్రభుత్వానికి అందజేయనున్నారు. 

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తెలుగు లలిత కళాతోరణం ప్రస్తుతం అధ్వాన్న స్థితిలో ఉంది. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఒకవేళ నిర్వహించాలని ఎవరైనా భావిస్తే.. వారి చేతి చమురు వదులుతోంది. సకల సదుపాయాలను సమకూర్చుకోవాల్సి వస్తోంది. దీంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడంలేదు. 

ఈ పరిస్థితుల్లో దీనికి మరమ్మతులు చేసేందుకు ఎవరైనా దాతలు ముందుకు రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ వెంటనే కళాభిమానం కలిగిన వ్యక్తిగా టీఎస్సార్‌ ముందుకు వచ్చి.. పది కోట్ల రూపాయల వ్యయంతో ఆధునకీకరించనున్నట్టు ప్రకటించారు. 

దీనికి ప్రతిఫలంగా ఆయన ఈ ఆడిటోరియం పేరును రాజీవ్ కళాతోరణంగా మార్చాలని ప్రతిపాదించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం టీఎస్సార్ అడిగిందే తడవుగా ఆమోదం తెలిపింది. అయితే, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగడంతో ప్రభుత్వం తొలుత చేసిన ప్రకటనను సరి చేసి, రాజీవ్ తెలుగు కళాతోరణంగా మార్చుతూ జీవోను జారీ చేసింది. 

ఇదిలావుండగా, రాష్ట్రంలో ప్రత్యేక, సమైక్యాంధ్ర ఉద్యమాల వేడి ఇంకా తగ్గని నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని పదికోట్ల రూపాయలను ఉదారంగా ఇచ్చేందుకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేత ఎవరైనా ముందుకు వస్తారా అన్నదే ఇక్కడ కలిగే ధర్మసందేహం. కానీ, కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా మేలిగే టీఎస్సార్ ఈ ఆడిటోరియంను మరమ్మతులు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుకోసం పది కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్టు ప్రకటించారు. 

ఒకవేళ రేపు రాష్ట్రం విడిపోతే ఈ రాజీవ్ తెలుగు కళాతోరణం తెలంగాణ ప్రాంతానికే చెందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.పది కోట్లు వెచ్చించి ఆధునకీకరించేందుకు టీఎస్సార్ ఎందుకు ఆసక్తి చూపారన్నదే ఇపుడు అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే... టీఎస్సార్ ఇంత సాహసానికి చొరవ చూపేవారు కాదన్నది రాష్ట్ర వర్గాల సమాచారం. 

డిసెంబరు 31వ తేదీన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర పరిస్థితులపై నివేదిక సమర్పించినప్పటికీ.. ఆ నివేదికను బహిర్గతం చేయడమా లేదా అన్నది కేంద్ర విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకుండా ఆ ప్రాంత అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్ర రాజకీయ పార్టీల్లోనే ఐకమత్యం, స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపక పోవచ్చన్నది కొంతమంది నిపుణులు అభిప్రాయం. ఆ ధీమాతోనే టి.సుబ్బిరామిరెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. పైపెచ్చు తెలుగు లలితకళాతోరణం పేరును రాజీవ్ 
తెలుగు కళాతోరణంగా పేరుమార్పించి అధిష్టానానికి మరింత దగ్గరయ్యారని చెప్పవచ్చు

0 comments:

Post a Comment