Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Friday, October 15, 2010

హస్తానికి చేయిచ్చిన జగన్: కొత్త పార్టీకి సంకేతమా..?!!



వైఎస్.జగన్మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానాన్ని హడలెత్తిస్తున్న యువనేత. అధిష్టానం చెప్పిన మాటను వినకుండా, ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఎంతటి ఇబ్బందులనైనా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పొలిటికల్ రెబెల్ స్టార్. ఉత్తరాంధ్ర పర్యటనలో ఏకంగా సీఎం రోశయ్యపైనే బాణాలు విసిరారు. జగన్ ఆ తర్వాత కాస్త స్వరం తగ్గించుకున్నా, తన చేతల ద్వారా తన నిర్ణయాన్నిబాహాటంగానే చాటిచెపుతున్నారు. 
వైఎస్ వర్గంగా పేరుబడినవారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడంపై జగన్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అయినా ఓర్పుతో యాత్రను దిగ్విజయంగా ముందుకు సాగిస్తున్నారు. యాత్ర సాగుతుండగానే ఆయనకు సహకరిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది. అలా పార్టీ హైకమాండ్ మాట విననివారి తోక కత్తిరించి వేస్తామన్న బలమైన సంకేతాలను పంపింది. దీంతో చాలామటుకు కాంగ్రెస్ నాయకులు జగన్‌తో మాట్లాడేందుకు సైతం జంకుతున్నారు. 
ఐతే కాంగ్రెస్ హైకమాండే దిమ్మతిరిగేలా జగన్ స్పందన ఉంటోంది. తాజాగా నెల్లూరులో ఆయన చేపట్టిన యాత్రను చూస్తే ఇది స్పష్టమవుతుంది కూడా. ఓదార్పు యాత్ర సందర్భంగా నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ అండ్ సన్ బొమ్మలతో కూడిన జెండాలు ఎటు చూసినా రెపరెపలాడుతున్నాయి. ఈ జెండాలో అనూహ్యంగా హస్తంగానీ, సోనియా బొమ్మగానీ మచ్చుకైనా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా వైఎస్సార్, వైఎస్ జగన్‌తో కూడుకుని ఉన్న జెండాలే. 
ఈ వ్యవహారంపై జగన్ వర్గం తెలివిగా సమాధానాలిస్తోంది. జగన్ చేపట్టిన యాత్ర వ్యక్తిగతమైందని కాంగ్రెస్ అధిష్టానమే చెప్పిందనీ, ఈ పరిస్థితుల్లో వారి బొమ్మలను వాడుకుంటే మరోసారి తాము వారి ఇమేజ్‌ను దుర్వినియోగం చేశామంటారేమోనన్న భయం వల్లనే వారి బొమ్మలను జెండాల్లో లేకుండా చూశామన్నారు. 
ఐతే, రోజురోజుకీ వైఎస్ జగన్ పట్ల కాంగ్రెస్ హైకమాండ్ అనుసరిస్తున్న వైఖరితో విసిగి ఉన్న జగన్ వేరుకుంపటి పెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు భోగట్టా. పైగా ఓదార్పు యాత్రలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూస్తే భవిష్యత్తులో ఆయనకు ఎదురే ఉండదన్న ధీమాలో వైఎస్ వర్గం ఉంది. 
ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా ఓదార్పు పర్యటన ముగించుకున్న అనంతరం ఓ కీలకమైన నిర్ణయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తమ్మీద జగన్ ఎన్ని చేస్తున్నా.. అవన్నీ చూడటమే తప్పించి ఆయనపై ఎటువంటి చర్య తీసుకునే సాహసం చేయలేకపోతోంది కాంగ్రెస్ హైకమాండ్. చివరికి ఎవరు ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారో చూడాలి.

0 comments:

Post a Comment