Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Wednesday, September 1, 2010

వైఎస్ బతికి ఉంటే ఎంతో సంతోషించేవారు: మన్మోహన్

తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచే పనులకు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కృషి ఫలితంగా ఈ రోజున ఇక్కడ రెండు ప్రాజెక్టులకు శంకుస్థాన చేయడం జరిగిందన్నారు. అందులో ఒకటి మన్నవరంలో ఎల్టీపీసీ-భెల్ విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టు కాగా, రెండోది తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం పనుల ప్రారంభమన్నారు.

ఈ రోజున దివంగత నేత వైఎస్ బతికి వుంటే ఎంతో సంతోషించేవారన్నారు. సెప్టెంబరు రెండో తేదీన రాజశేఖర్‌ రెడ్డి మొదటి వర్థంతిని గుర్తు చేసిన ప్రధాని.. ఈ సందర్భంగా ముందుగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి దేశంలో ఉన్న అతిగొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒకటన్నారు. ఇక్కడకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వస్తుంటారన్నారు. అందువల్లే ఇక్కడ అంతర్జాతీ టెర్మినల్ నిర్మించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిపారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం ఎంతో సంతోషించదగిన విషయంగా ప్రధాని మన్మోహన్‌ అన్నారు. కాగా, తిరుపతి విమానాశ్రయ అభివృద్ధికి ఈ ఏడాది రూ.174 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందని ఆయన గుర్తు చేశారు.

అంతకుముందు ముఖ్యమంత్రి కె.రోశయ్య సందేశాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రఫుల్ పటేల్, వీరప్ప మొయిలీ, వనబాక లక్ష్మి, విలాస్ రావ్ దేశ్‌ముఖ్, సుషీల్ కుమార్ షిండే, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

0 comments:

Post a Comment