Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Monday, September 6, 2010

నెల్లూరులో చీలిన వైఎస్సార్ వర్గం: "ఓదార్పు" ఎఫెక్ట్

ఓదార్పు యాత్రపై కాంగ్రెస్ అధిష్టానం నిర్దేశించిన బలమైన ఆదేశం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్గాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రకాశం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ ఓదార్పుకు మద్దతు మాత్రమే ఇవ్వకుండా దూరంగా ఉంటే, నెల్లూరులో ఒకడుగు ముందుకేసి వైఎస్సార్ విగ్రహ ప్రతిష్టాపన అడ్డుకునే వరకూ వెళ్లింది. 

వైఎస్ వీరవిధేయులుగా పేరు సంపాదించుకున్న నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ ఓదార్పుకు నెల్లూరులో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ విగ్రహ ప్రతిష్టాపనకు జగన్ వర్గం సోమవారం నెల్లూరు సెంటర్‌లో తవ్విన కుంటను పోలీసులు సమక్షంలో అధికారులు పూడ్చి వేశారు. దీంతో వైఎస్సార్ వర్గంలో అభిప్రాయభేదాలు భగ్గుమన్నాయి. 

వైఎస్ వర్గంగా పేరున్న ఆనం బ్రదర్స్‌కు మేకపాటి వర్గానికి మధ్య చిచ్చు రగిలిందన్న వాదనలు వినబడుతున్నాయి. అయితే మేకపాటి మాత్రం తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని చెపితే.. ఆనం వివేకానంద రెడ్డి మాత్రం ఎవరి పేరు చెప్పకుండా విమర్శలు గుప్పించారు. 

కొన్ని కాకులు, ఉడుతలు వంటి నాయకులు రాజకీయ లబ్దికోసం తమపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారన్నారు. నిజానికి వైఎస్ కుటుంబం అంటే తమకు ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు. వైఎస్ అన్న తమకు నేర్పిన పాఠాన్నే శిరసా వహిస్తున్నామన్నారు. 80 ఏళ్ల కాంగ్రెస్ పార్టీతోనూ, కాంగ్రెస్ అధిష్టానానికి వీరవిధేయులుగా ఉంటామన్నారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తిగత యాత్ర కనుక దానితో తమకు సంబంధం లేదన్నారు. 

విగ్రహ ప్రతిష్టాపనను తామేదో అడ్డుకుంటున్నామని ప్రచారం చేస్తున్న పిల్లకాకుల మాటలను తాము పట్టించుకోబోమన్నారు. తాము ఏటిలో తుంగలాంటి వారమనీ, వరద ఉధృతి వచ్చినపుడు తలవంచుతామనీ, ఆ ఉధృతి తగ్గిన తర్వాత తిరిగి తల ఎత్తుక తిరుగుతామన్నారు. కొంతమంది ఛోటా నాయకులు ఏదో ప్రాబల్యం పెంచుకునేందుకు ఆడుతున్న నాటకం తప్ప మరేమీ కాదన్నారు. నెల్లూరులో వైఎస్ విగ్రహాలు ఒకటి కాదు వందల్లో ప్రతిష్టాపన చేసినా తనకు ఆనందం తప్ప ద్వేషం రాదని చెప్పారు. 

వైఎస్సార్ వర్గమని కొంతమంది చెపుతుండటాన్ని కూడా ఆనం వివేకానంద రెడ్డి తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ వర్గమనేదే లేదనీ, వైఎస్ అంటేనే కాంగ్రెస్ అని అన్నారు. అంతేతప్ప కాంగ్రెస్ వర్గమంటూ ప్రత్యేకంగా ఏమీలేదని స్పష్టం చేశారు. నెల్లూరులో కొంతమంది వేషగాళ్లు, ఆటగాళ్లు, వైఎస్ భక్తులుగా నాటకాలాడుతూ వైఎస్ వర్గమని ప్రత్యేకంగా పేర్లు సృష్టిస్తున్నారని విమర్శించారు.

ఇదిలావుండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆనం సోదరులతో టచ్‌లో లేడనీ, మేకపాటి రాజమోహన్ రెడ్డి అనుయాయులను చేరదీస్తూ తమ వైరివర్గాన్ని ప్రోత్సహిస్తారన్న ఆందోళనలో ఆనం బ్రదర్స్ ఉన్నట్లు సమచారం. పైగా సుదీర్ఘ చరిత్ర కల కాంగ్రెస్ పార్టీతో లడాయికి సై అన్నట్లుగా వైఎస్ జగన్ వ్యవహరించడం కూడా ఆనం సోదరులకు ఎంతమాత్రమూ రుచించడం లేదని భోగట్టా. వీటి దృష్ట్యానే జగన్‌ను వదిలి కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు.

0 comments:

Post a Comment