రాష్ట్ర పరిస్థితులు రోజుకో విధంగా మారిపోతున్నాయి. శాంతిభద్రతలు క్షీణించి పోతున్నాయి. వేర్పాటువాదులు ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. ఇది వారి దినచర్యగా మారింది. పైపెచ్చు కీలక విషయాలపై త్వరితగతిన, ఖచ్చితమైన నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకోలేక పోతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే, పైకి మాత్రం రాష్ట్ర సర్కారు పనితీరు బాగానే ఉందని గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు పదేపదే చెపుతున్నారు. వీరికి వాస్తవ పరిస్థితులు ఏమిటో బాగానే తెలుసని పలువురు నేతల వాదన. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటన వల్ల రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
వీటికి తోడు గత యేడాది కాలంగా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి మందగించింది. పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్క కంపెనీ సాహసం చేయడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. అలాగే, తెలంగాణ ప్రాంతంలో ఏదో ఒక చోట బంద్‌లు, ఘర్షణలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగానే నష్టం వాటిల్లుతుంది. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కొద్ది రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించి పరిస్థితులను చక్కదిద్దడమే కాకుండా, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమకారుల పీచమణచాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.
ఇదిలావుండగా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కేంద్రానికి నివేదికలు పంపుతున్నారు. ఇందులో గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి సంఘటనలను ఆయన ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం. వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు కూడా వారానికొకటి చొప్పున నివేదికలు ఇస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రజల్లో అభద్రతాభావం పెరిగిపోతోందన్నది ఈ నివేదికల ప్రధాన సారాంశంగా ఉంది.
అటు గవర్నర్ - ఇటు కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికలను కేంద్ర సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, రాష్ట్రంలో పరిస్థితుల అధ్యయానికి కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ డిసెంబరు 31వ తేదీలోపు తన నివేదికను సమర్పించనుంది. ఈ నివేదిక ఎలా ఉన్నప్పటికీ.. ఏదో ఒక ప్రాంతంలో అల్లర్లు చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఖాయమని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.
పైపెచ్చు.. జనవరి తర్వాత విద్యార్థులకు పరీక్షా సమయం. అందువల్ల ప్రత్యేక, సమైక్యాంధ్ర ఉద్యమాల ఆందోళనలు తీవ్రతరమైతే విద్యార్థులు తమ కెరీర్‌ను కోల్పోయే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేస్తున్న కేంద్రం.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత రాష్ట్రపతి పాలన విధించాలని భావిస్తోంది. ఇలా చేయడం వల్ల శాంతిభద్రతలు అదుపులోకి వస్తాయన్నది కేంద్ర భావనగా ఉంది. అందువల్ల కొత్త యేడాదిలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్టు ఢిల్లీ వర్గాల భొగొట్టా.
BHANUKIRAN WIL BE PRODUCED IN COURT BY TOMMAROW
12 years ago
0 comments:
Post a Comment