Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Monday, September 20, 2010

ఐ లవ్ లగడపాటి: కేసీఆర్‌కు సంస్కారం తెచ్చిన తంటా!!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహానికి లోనయ్యారు. నిన్నటి వరకు జైకొట్టిన ఉద్యమకారులు.. నేడు కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసే స్థాయికి వచ్చారు. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌ నిర్వహించిన చర్చా వేదికలో కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తకర పరిస్థితులకు దారితీశాయి. అదేసమయంలో తెలంగాణలోని సీమాంధ్ర ప్రజానీకాని భరోసా ఇచ్చేలా ఉన్నాయి. మొత్తంమీద రాజకీయ ప్రజా జీవితంలో ఉండే నేతలు చేసే వ్యాఖ్యలు ఎంతటి ఉపద్రవానికి తీయగలవో కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

తెలంగాణలో పుట్టినవారు ఇక్కడి వారేనని, వారు అన్ని ఉద్యోగాలకు, పదవులకు, హక్కులకు పూర్తి అర్హులని కేసీఆర్ అన్నారు. పైపెచ్చు.. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కరుడుగట్టిన సమైక్యవాది, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను కేసీఆర్ పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. సమైక్యాంధ్ర హీరోగా అభివర్ణించారు. అందుకే లగడపాటిని "ఐ లవ్ యూ" అని కేసీఆర్ ప్రేమగా అన్నారు.

'స్థానికం' అంశంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కొంతమంది ఉద్యమకారులు వ్యతిరేకిస్తుంటే... తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన లగడపాటిని పొగడ్తల వర్షంలో ముంచెత్తడం ప్రతి తెలంగాణ పౌరుడిని, ఉద్యమకారుడిని ఆగ్రహోద్రుక్తుడిని చేస్తున్నాయి. ఫలితంగా కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనాలకు దారితీస్తూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం నాటకీయంగా కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు దిగగా, అంతే నాటకీయ పరిణామాల మధ్య విజయవాడ నుంచి హైదరాబాద్‌ నిమ్స్ ఆస్పత్రిలో లగడపాటి పరుగు పెట్టారు. ఈ దృశ్యాలు తెలంగాణవాదుల్లోనే కాకుండా, సమైక్యాంధ్ర వాసుల కళ్లలోనూ ఇంకా కదలాడుతూనే ఉన్నాయి.

అంతేకాకుండా, తెలంగాణ ఏర్పాటుకు ప్రథమ శత్రువు లగడపాటి (కేసీఆర్ భాషలో జగడపాటి) అని ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు భావిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ప్రేమిస్తున్నానని కేసీఆర్ చర్చావేదికలో చెప్పడం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే దిష్టబొమ్మలు దహనం చేస్తూ, భేషరతు క్షమాపణ చెప్పాలని కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నారు. లగడపాటితో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా, తెరాస (కేసీఆర్) రాజకీయ ప్రయోగశాలగా మారిన ఉస్మానియా విద్యార్థి జేఏసీ కూడా కేసీఆర్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

అదేసమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, లగడపాటితో వ్యవహరించిన తీరును మరికొందరు సమర్థిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో నివశిస్తున్న సీమాంధ్ర వాసులకు కేసీఆర్ భరోసా కల్పించాలన్న విశాలదృక్పథంతో అలా వ్యాఖ్యానించారని వివరణ ఇస్తున్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులను హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఉండనివ్వరని లగడపాటి వంటి సమైక్యవాదులు ప్రజల్లో నూరిపోస్తున్నారు. ఇది వేర్పాటువాద ఉద్యమకారులకు మింగుడుపడటం లేదు. దీనికి చెక్ పెట్టాలన్న ఏకైక ఉద్దేశ్యంతోనే కేసీఆర్ అలా వ్యాఖ్యానించారని వారు వివరణ ఇస్తున్నారు.

అంతేకాకుండా, తనపై విమర్శలు చేస్తున్న వారిపై కేసీఆర్ విమర్శలు గుప్పిస్తూనే.. ఓ విజ్ఞప్తి కూడా చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడంమాని విశాల దృక్పథంతో చూడాలని కోరారు. మొత్తానికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, రాజకీయ ప్రత్యర్థుల పట్ల చూపిన సంస్కారం సొంతగడ్డపై విమర్శలకు దారితీయగా, సీమాంధ్రులు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా, వారి అభిమానాన్ని చూరగొన్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

0 comments:

Post a Comment