ఒక రోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కొనియాడారు. మన్నవరం ప్రాజెక్టు చిత్తూరు జిల్లాలో నెలకొల్పడానికి వైఎస్సార్ కారణమని చెప్పుకొచ్చారు. ఆయన గట్టిపట్టుదలతో కృషి చేయకుంటే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కేది కాదనే భావన వచ్చేలా సింగ్ వ్యాఖ్యానించారు.
తన ప్రసంగం ఆరంభం నుంచే వైఎస్‌పై పొగడ్తల జల్లు కురిపించారు. అలాగే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రులు సుషీల్ కుమార్ షిండే, విలాస్ రావ్ దేశ్‌ముఖ్ (కాంగ్రెస్)లు కూడా వైఎస్ కృషిని కొనియాడారు. తామిద్దరం మహారాష్ట్రకు చెందిన మంత్రులమైనప్పటికీ.. ప్రాజెక్టును తమకు దక్కనీయకుండా వైఎస్ చేశారని చమత్కరించారు.
అయితే, దేశ ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్సార్‌ను ఆకాశానికి ఎత్తేయడమే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ప్రస్తుతం వైఎస్ హఠాన్మరణం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజుకో రీతిలో మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ తనయుడు, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ తన పంథాలో ముందుకు సాగుతున్నారు.
వైఎస్ తర్వాత స్థాయిలో ప్రజాదారణను సొంతం చేసుకోవడమే కాకుండా తాను అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే ధోరణిని కనబరుస్తున్నారు. ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ. ఏమాత్రం ఖాతరు చేయడం లేదు.
ఈ నేపథ్యంలో వైఎస్‌ను పార్టీ ఆస్తిగా కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఇపుడు ప్రధాని నోటి వెంట వైఎస్‌ను ప్రస్తుతిస్తూ వ్యాఖ్యలు రావడం కూడా వైఎస్ అభిమానులను ఎంతో ఆనందానికి లోను చేశాయి. మన్నవరం ప్రాజెక్టు దక్కడానికి వైఎస్సే కారణమని ప్రధాని చెప్పారు.
అంతేకాకుండా, వైఎస్‌ను కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నేతగా చూసిందని, ఆయన చెప్పినట్టుగా తాము నడుచుకున్నామని ప్రధాని తన మాటల ద్వారా చెప్పారు. తద్వారా వైఎస్ పట్ల, ఆయన కుటుంబం పట్ల పార్టీ వివక్ష చూపిస్తుందని జరుగుతున్న ప్రచారానికి తెరదించేలా మన్మోహనాస్త్రాన్ని ఈ రాజకీయ ఆర్థికవేత్త సంధించి కాంగ్రెస్ శ్రేణులకు, వైఎస్ అభిమానులకు బలమైన సందేశాన్ని పంపడంలో సఫలీకృతులయ్యారు.
0 comments:
Post a Comment