ఆంధ్రప్రదేశ్‌కు 54 వసంతాలు
ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలుగువారి కల నెరవేరిన రోజు ఇవాళ. అదే నవంబర్ ఒకటి ...అంధ్ర ప్రదేశ్ అవతరణ దినం. రాష్ట్రం 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి నేటికి సరిగ్గా 54 ఏళ్లు అవుతోంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఇరవైరెండు జిల్లాల్లో తెలుగు మాట్లాడే వారు ఉండేవారు. 1952లో మదరాసు ప్రెసిడెన్సీలో ఉన్న తెలుగువారందరికి కలిపి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టిశ్రీరాములు 56 రోజులు నిరాహారదీక్ష చేసి కన్నుమూశారు.
ఆయన త్యాగఫలంతో రాయలసీమ, కోస్టల్ ఆంధ్రాలను కలిపి 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పడిన భాషాప్రయుక్త రాష్ట్రం. దీనికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. తరువాత 1956లో నిజాం స్టేట్‌లోని తోమ్మిది తెలుగు జిల్లాలను , ఆంధ్రరాష్ట్రంలోని రాయలసీమ, కోస్టల్ ఆంధ్రాలను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది .
హైదరాబాద్ రాజధానిగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఇవాళ తెలుగు వారు స్వేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నారంటే దానికి కారణం పొట్టి శ్రీరాములు చేసిన కృషి అని చెప్పక తప్పదు. 1901 మార్చి 16వ తేదిన చెన్నపట్నంలో జన్నించిన ఆయన ప్రాధమిక విద్యను అభ్యసించి శానిటరీ ఇంజనీరింగ్ కోర్సు చేసి పశ్చిమ రైల్వేలో ఉద్యోగం చేశారు.
ఓకే ఏడాది తల్లి, భార్య చనిపోవడంతో చలించిన పొట్టి శ్రీరాములు ఆస్థిపాస్తులను సోదరులకు అప్పగించి స్వాతంత్ర్య ఉద్యమం వైపు అడుగులు వేశారు. మహాత్మ గాంధీ అనుచరుడుగా ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంయుక్త రాష్ట్రంలో తెలుగువారికి అన్యాయం జరుగుతోందని భావించి 1952 అక్టోబర్ 19న చెన్నైలోని బులుసు సాంబమూర్తి ఇంట్లో ప్రత్యేక తెలుగురాష్ట్రం కోసం ఆమరణ నిరాహర దీక్షను ప్రారంభించారు. అప్పట్లో ఆయన దీక్షకు మద్దతుగా ప్రజలు పలు చోట్ల ఉద్యమాలు చేశారు.
56 రోజుల దీక్షలో పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15న చివరి శ్వాస వదలడంతోఆంధ్ర రీజియన్, మద్రాస్ ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఆయన ప్రాణ త్యాగానికి స్పందించిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు 1953 అక్టోబర్ ఒకటిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్.... రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములు చేసిన కృషికి జాతి ఆయనకు ఘన నివాళి అర్పిస్తోంది.
0 comments:
Post a Comment