హైదరాబాద్: శాంతి భద్రతల విషయంలో కఠినంగా, కచ్చితంగా వ్యవహరిస్తానని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ కమిటీ హాల్‌లో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. ఆయనేం మాట్లాడారంటే... ‘‘నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి, సోనియాకు, ప్రధాని మన్మోహన్‌లకు కృతజ్ఞతలు. మీడియా సహకారం నాకు కావాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అన్నింటిని అమలు చేసేందుకు పూర్తిగా ప్రయత్నిస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరింత మెరుగుపరిచి ఎక్కువ మంది లబ్ది పొందేలా చూస్తాం. జలయజ్ఞం, పారిశ్రామీకరణను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తాం. సంక్షేమ పథకాల అమలుపై ప్రతి మూడు మాసాలకొకసారి సమీక్ష జరుపుతాం. హైదరాబాద్‌ను పెట్టుబడులకు అత్యంత అనుకూలమయిన నగరంగా చేసేందుకు ప్రయత్నిస్తాం. ఎంపీలు, కేంద్ర ప్రభుత్వం, స్థానిక నాయకుల సహకారంతో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కృషి చేస్తాం. రాష్ట్రాభివృద్ధి కోసం అందరినీ కలుపుకునిపోతా. ప్రతిపక్షాలు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది. ప్రజలకు మేలు జరుగుతుంది. 41 ఎంపీ సీట్లు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న వైఎస్సార్ రాజకీయ చివరి కోరికను నెవేర్చేందుకు కలిసికట్టుగా కృషి చేస్తాం. ఆరోగ్యం, విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. దీనికనుగుణంగానే సీఎం పదవి చేపట్టిన వెంటనే నిమ్స్ ఆస్పత్రిని సందర్శించాను. మంత్రివర్గ ఏర్పాటుపై అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. ఢిల్లీకి ఎప్పుడు వెళ్లాలో ఇంకా నిర్ణయించుకోలేదు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటాను. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తా. నేను ఏం చేయాలనుకుంటున్నానో నా పనితీరే చెబుతుంది’’ అని కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. |
0 comments:
Post a Comment