Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Wednesday, August 4, 2010


ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న జగన్ వర్గీయులకు కాంగ్రెస్ అధిష్ఠానం తన పవర్‌ను క్రమంగా రుచి చూపిస్తోంది. నోటికి తాళాలు వేస్తోంది. కాంగ్రెస్‌లోనే ఉంటూ ఓవైపు "జై జగన్" అంటూనే మరోవైపు "వీక్ రోశయ్యా" అంటూ చెణుకులు విసురుతూ దూకుడు వ్యాఖ్యలు చేసిన అంబటిపై తొలి అస్త్రాన్ని సంధించిన కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా కొండా సురేఖపై ఎక్కుపెట్టింది.

మహావృక్షంలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన కొమ్మల్లాంటి నేతలను తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీని బలహీన పరుస్తున్నారని కొండా సురేఖ తన 11 పేజీల సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఇపుడున్నది బహు బలహీనమైన నాయకత్వమనీ, అందువల్లనే కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో కొట్టుమిట్టాడుతోందని తెలిపింది.

అన్నిటికీ మించి అసలు తాము స్వపక్షంలో ఉన్నామో విపక్షంలో ఉన్నామో అర్థంకాని అయోమయ స్థితిలో ఉన్నామని పేర్కొనడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఫలితంగానే కొండాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

అధిష్ఠానం పంపిన షోకాజ్ నోటీసుకు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వివరణ ఇచ్చుకుంటానని సురేఖ వెల్లడించింది. మరోవైపు రెండు రోజుల్లో అంబటి రాంబాబు క్రమశిక్షణా సంఘం ముందు తన వాదనలను సమర్థించుకోనున్నారు. అంబటి తాను ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారో చూద్దామన్న ధోరణిలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం.

ఇదిలావుండగా పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా వారిపై చర్య తప్పదని కాంగ్రెస్ హైకమాండ్ తన చర్యల ద్వారా హెచ్చరిస్తోంది. ప్రత్యేకించి జగన్ వర్గీయులను. ఈ సంగతి ఇలా ఉంటే బుధవారం జగన్ వర్గీయులందరూ అంబటి స్వగృహంలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాగూ అధిష్టానం తమను టార్గెట్ చేస్తుంది కనుక భవిష్యత్తులో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై వారు కసరత్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఏదేమైనా జగన్ వర్గానికి వరుస షాక్‌లు ఇస్తూనే ఉన్నది కాంగ్రెస్ హైకమాండ్. మరోవైపు జగన్ కాకినాడ ఓదార్పు సభలో తన సహనం ఎన్నాళ్లు ఉంటుందో తనకే తెలియదని చెప్పారు. అలా చెప్పినప్పటికీ హైకమాండ్ జగన్ మాటలను పట్టించుకున్నట్లు ఏమీ కనబడటం లేదు. హద్దు మీరితే జగన్‌పైనా గురి పెట్టడం ఖాయమని తాజా సంఘటనలనుబట్టి అర్థమవుతోంది. మరి జగన్ సహనంగానే ఉంటారో... సహనం కోల్పోతారో చూడాలి.

0 comments:

Post a Comment