Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Friday, July 30, 2010

ఇక తెలంగాణాను ఆపటం ఎవరి తరం కాదు: కేసీఆర్


ఉపఎన్నికల్లో తెలంగాణా ప్రజలు తమ గుండెల్లోని ఆకాంక్షను చీల్చి బయటకు తెచ్చి తెరాసకు ఓట్లుగా మలిచారనీ, ఇక తెలంగాణా రాష్ట్రాన్ని ఆపటం ఎవరి తరమూ కాదని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన జరిగే వరకూ తెలంగాణా ప్రజలు ఇదే స్ఫూర్తితో ఉండాలని పిలుపునిచ్చారు.

తెలంగాణాలో తెరాస సాధించిన భారీ విజయాన్ని తెలుసుకుని ప్రపంచంలోని 18 దేశాలలో ఉన్న తెలంగాణా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని కేసీర్ అన్నారు. అమెరికాలో శెలవు దొరకకపోయినా, ప్రత్యేకించి సంబరాలు చేసుకునేందుకు బలవంతంగా శెలవు పెట్టి పార్టీ చేసుకుంటున్నట్లు వారు తనతో చెప్పారన్నారు.

తమ గెలుపును అడ్డుకునేందుకు కాంగ్రెస్ - తెలుగుదేశం మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాయన్నారు. ఈ దగాకోరు పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణా ప్రజలు వారి చెంప ఛెళ్లుమనిపించేలా, కళ్లు గిర్రున తిరిగేలా, ఢిల్లీ పీఠానికి వినబడేలా తమ తీర్పునిచ్చారన్నారు. ఈ గెలుపుకు కృషి చేసిన విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు మా తెలంగాణా అక్కాచెల్లెళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

ఇక మీడియా బాసులు ఇబ్బందిపెట్టినా తమ ఎన్నికల పర్యటనల గురించి పేపర్లలో వచ్చేటట్టు తెలంగాణా జర్నలిస్టులు పాటుపడ్డారనీ, అందుకుగాను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ గెలుపు తెరాసది కాదనీ, నాలుగు కోట్లమంది తెలంగాణా ప్రజలదని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఇప్పటికైనా ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీలు ఈ ఎన్నికలను ఓ రెఫరెండంగా తీసుకుని రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాలో పర్యటించకుండానే ఇక్కడి ప్రజలు ఈ గెలుపుతో ఏకగ్రీవంగా నివేదిక ఇచ్చారని తెలిపారు. కనుక కేంద్రం ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు

0 comments:

Post a Comment