Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Sunday, September 5, 2010

వైఎస్ అవినీతి గురించి మాట్లాడే మగాడివా: రఘువీరా

హిందూపురం,సెప్టెంబర్ 5 : నిరుపేదల కోసం ఎన్నో పథకాలు అమలు పరిచి, వారి గుండెల్లో గూడుకుట్టుకున్న వైఎస్ అవినీతిపరుడంటూ మాట్లాడే అంతటి మగాడివా.. అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడునుద్దేశించి వ్యవసాయశాఖా మంత్రి రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఆదివారం అనంతపురం జిల్లా హిందూపురంలో మునిసిపల్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

తాము లబ్ది పొందామని బహిరంగంగా మునిసిపల్ ఉద్యోగులు ప్రకటించుకునే విధంగా వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు జరుపడం అభినందనీయమన్నారు. జనం తమ ఇష్టమైన నాయకుడిగా భావించి ప్రాంతాల వారిగా పట్టణాల వారిగా వైఎస్ఆర్ విగ్రహాలను ప్రతిష్ఠ చేసుకుంటుంటే చంద్రబాబుకు ఎందుకంత మంట అంటూ విరుచుకుపడ్డారు. అవును లక్ష విగ్రహాలు ఏర్పాటు చేస్తాం ఏమి చేస్తావో చూస్తామని శపథం చేశారు.

హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడటం కాదు చేతనైతే జనం మధ్యకు వచ్చి ఇదే మాట ప్రకటిస్తే ఒళ్ళు హూనం చేస్తారని హెచ్చరించారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయాలలోకి వచ్చిన చంద్రబాబు చివరకు ఆయన పేరు లేకుండా చూడాలని ప్రయత్నించారని విమర్శించారు. మీరు ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టుకుంటామంటే మేము వ్యతిరేకించేవారమా అని ప్రశ్నించారు. బతికి ఉన్నా నీజీవితం వ్యర్థమన్నారు. నీ ఒళ్ళంతా కుళ్ళిపోయిందన్నారు.

ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళ పాలనలో ఎవరికి సాయం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రూపాయల బియ్యం మార్చావు, మద్యపానం, ఉచితవిద్యుత్ పథకాలను పక్కదారి పట్టించిన వాడివి కావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఆరంభ మయ్యాయని, ఇక ఎదురులేదని భావిస్తున్నావా.. అటువంటిదేమీ జరుగదు.. ఏక్షణంలోనైనా ఒక్కటవుతామని పరోక్షంగా జగన్ గురించి ప్రస్తావించారు. నీ సినిమా అయిపోయింది. ఇక నీవు కుప్పంలో కూడా గెలువలేవని సవాల్ విసిరారు. .

ఆంధ్రావాళ్లు గాజులు తొడుక్కొని లేరు!: ఎంపీ రాయపాటి

చక్కగా ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేందుకు వెళ్లిన అభ్యర్ధులపైనా, పరీక్షా కేంద్రాలపైన దౌర్జాన్యాలకు పూనుకోవడం చాలా అన్యాయం..దుర్మార్గం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రత్యేక ఏపీపీఎస్సీ పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు...అంతేగానీ ఇలా పదేపదే దౌర్జన్యాలకు పాల్పడితే మాత్రం సహించేది లేదు..ఆంధ్రావాళ్లేమీ గాజులు తొడుక్కొని లేరని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. గ్రూప్-1 పరీక్షా కేంద్రాలపై తెలంగాణలో పలుచోట్ల దాడులకు పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దురాగతాలకు టీఆర్ఎస్సే కారణమని ధ్వజమెత్తారు. కుళ్లు, స్వార్ధ రాజకీయాల కోసం టీఆర్ఎస్ యువత భవిష్యత్తును బలిపెడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

యువతను ప్రోత్సహించి వారిచేత అరాచకాలను చేయిస్తుందని ఆందోళన చెందారు. తెలంగాణ నాయకులు మొదటి నుంచి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నందునే ప్రభుత్వం ఇలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించలేక పోతుందని చెప్పారు. చంద్రబాబు, వైఎస్‌ల నుంచి నేటి ముఖ్యమంత్రి రోశయ్య వరకు అందరినీ తెలంగాణ నేతలు బ్లాక్ మెయిలింగ్ చేస్తూ వచ్చారని ఆరోపించారు.

ప్రస్తుతానికి తాము చాలా సంయమనం పాటిస్తూ మౌనం వహిస్తున్నామన్నారు. అంతమాత్రాన తమను తక్కువ అంచనా వేయొద్దన్నారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతాం...ఏం చేయాలో అదే చేస్తామని రాయపాటి ఆగ్రహంగా అన్నారు. ఇక జగన్ ఓదార్పు యాత్రపై మీ వైఖరి ఏమిటని ప్రశ్నించగా హైకమాండ్ నిర్ణయం ప్రకారమే తాము నడుచుకుంటామని, తమకొక ప్రత్యేక పం«థా అంటూ ఏదీలేదని అన్నారు. జగన్ గుంటూరు జిల్లా యాత్ర గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.

విద్యార్థుల జీవితాలో చెలగాటమాడొద్దు: ఎంపీ లగడపాటి





ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని వంకగా చూపి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హితవు పలికారు. గ్రూప్-1 పరీక్షలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు చేసిన యత్నాలను ఆయన ఖండించారు. 
దీనిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఏపీపీఎస్సీ పోస్టుల్లో 42 శాతం వాటా కేటాయించడం అసాధ్యమన్నారు. దీనికి రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. ఈ విషయం తెలిసిన కొంతమంది రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను పావులుగా వాడుకుంటూ.. వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. 
ప్రధానంగా, ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అవినీతిపరుడని, ఆయనను తక్షణం తప్పించాలని డిమాండ్ చేయడం తగదన్నారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏయేడాది ఫిబ్రవరితో ముగుస్తుందన్నారు. ముఖ్యంగా, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ అనంతరం ఆయన రిటైర్ అవుతారని లగడపాటి గుర్తు చేశారు.

తెరాస నేతలు కుక్కలతో సమానం: ఎమ్మెల్యే శంకర్ రావు

తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీరితో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చేతులు కలపడాన్ని ఆయన తప్పుబట్టారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెరాస నేతలను కుక్కలతో పోల్చారు. 

ఈ సందర్భంగా ఆయన తెరాస నేతలను కుక్కలతో పోల్చుతూ.. ఒక సామెతను గుర్తు చేశారు. "దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి" అనే సామెత తెరాస నేతలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుందన్నారు. ఏపీపీఎస్సీ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ ఎపుడో విడుదలైతే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

గ్రూప్-1 పోస్టుల్లో 42 శాతం వాటాను కేటాయించాలని కేవలం ఐదారు రోజులుగానే డిమాండ్ చేశారని, అంతకుముందు వీరంతా ఏం చేస్తున్నారన్నారు. పరీక్షా తేదీని దగ్గర పడిన తర్వాతే వారికి ఈ విషయం గుర్తుకు వచ్చిందా అని శంకర్ రావు ప్రశ్నించారు. 

ఇలాంటి తెరాస నేతలతో తమ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు చేతులు కలపడం దుదృష్టకరమన్నారు. అయితే, శంకర్ రావు వ్యాఖ్యలను కొంతమంది కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. తాము విద్యార్థులకు మాత్రమే సంఘీభావం ప్రకటించామన్నారు

Friday, September 3, 2010

ప్రకాశం జిల్లా ఓదార్పు


జన హృదయ నేత వైఎస్సార్ మృతిని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను పరామర్శించడానికి వై.ఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో జరుగనుంది. తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి శుక్రవారం ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు ప్రయాణమయ్యారు. 
అంతకుముందు జగన్ వైఎస్సార్ ఘాట్‌లో తండ్రికి నివాళులు అర్పించారు. ప్రకాశం జిల్లాలో నేటి నుంచి పదిరోజుల పాటు ఈ యాత్ర జరుగనుంది. గిద్దలూరు నుంచి పది గంటలకు ఆరంభమయ్యే ఈ యాత్రకు జగన్ వర్గం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలిరోజు నాలుగు కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.
ఇదిలా ఉంటే.. ఓదార్పు యాత్రను ఆపేందుకు జగన్ ససేమిరా అన్నారు. అధిష్టానం ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని సైతం జగన్ కాదన్నారు. ఓదార్పును ఆపేందుకు అధిష్టానం దూతగా ఇడుపలపాయకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ మాటలను కూడా జగన్ తోసిపుచ్చారు.
శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ప్రారంభించి తీరుతానని మొయిలీతో జగన్ స్పష్టం చేశారు. మాట తప్పడం.. మడమ తిప్పడం తమ ఇంటా వంటా లేదంటూ జగన్ తెగేసి చెప్పినట్లు సమాచారం

Thursday, September 2, 2010

ప్రజలు తిరగబడితే అధిష్టానం మటాష్: ఎమ్మెల్యే ఆది

రాష్ట్ర ప్రజలు తిరగబడితే అధిష్టానం నామరూపాలు లేకుండా పోతుందని జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. ప్రజాభిమానం ముందు అధిష్టానం కూడా బలాదూరేనని ఆయన తేల్చి చెప్పారు. అందువల్ల వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందేనన్నారు. 

వైఎస్ఆర్ ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ మృతి చెంది యేడాది గడుస్తున్నా ఆయనపై వున్న అభిమానం నానాటికీ పెరుగుతోందన్నారు. 

దీన్ని అధిష్టానం ఇప్పటికైనా గుర్తించాలన్నారు. లేనిపక్షంలో ప్రజలతో పాటు.. పార్టీలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని జగన్‌కు తగిన న్యాయం చేయాలన్నారు.

మాటతప్పని.. మడమతిప్పని మహానేత వైఎస్: జేసీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిపై సీనియర్ నేత, మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. మాటతప్పని, మడమతిప్పని మహానేత వైఎస్ అని జేసీ కొనియాడారు, వైఎస్ మొదటి వర్థంతి వేడుకలను పురస్కరించుకుని గురువారం సీఎల్పీ కార్యాలయంలో వైఎస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందించి పక్కా ప్రణాళికతో అమలు చేశారన్నారు. అందువల్లే ఆయన పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. ప్రధానంగా ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే మనస్తత్వం వైఎస్‌ సొంతమన్నారు. అందువల్లే ఆయన జన హృదయాల్లో చెరగని ముద్రవేసుకుని శాశ్వితంగా నిలిచి పోయారన్నారు.

నేడు జనహృదయ నేత వైఎస్ఆర్ మొదటి వర్థంతి

ప్రజాహృదయనేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రథమ వర్థంతి గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. 2009 సెప్టెంబర్‌ రెండో తేదీన హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ఆర్‌ దుర్మరణం చెందిన విషయం తెల్సిందే. ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా గురువారం కడప జిల్లా ఇడుపులపాయలో నివాళులర్పించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర, కేంద్ర మంత్రులు హాజరవుతారు. కేంద్రం తరపున కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ హాజరై నివాళులర్పిస్తారు. అదేవిధంగా వైఎస్‌ తనయుడు జగన్‌ ప్రత్యేకంగా నివాళులర్పించనున్నారు. సమాచారశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలోనూ ప్రభుత్వం వైఎస్‌కు ఘన నివాళులర్పించేలా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంది. 

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సాయంత్రం సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. వర్థంతి కార్యక్రమాలు జిల్లాల్లోనూ నిర్వహించాలని డీసీసీ, సీసీసీ కమిటీలకు ఆదేశాలు జారీ చేసినట్లు పీసీసీ నేతలు తెలిపారు. 

ఇందులో మంత్రులతో పాటు జిల్లా కాంగ్రెస్‌నేతలు పాల్గొంటారని చెప్పారు. ఇదిలావుండగా రాజశేఖరరెడ్డికి ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ బుధవారమే ఇడుపులపాయలో నివాళులర్పించారు. ఆమె వెంట కుమార్తె షర్మిల, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

వైఎస్సార్ వర్థంతి: ముఖ్యమంత్రి రోశయ్య కన్నీళ్లు

దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధమ వర్థంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నల్లకాల్వ వద్ద వైఎస్ వర్థంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రోశయ్య పాల్గొనవలసి ఉండగా అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయారు. 

ఆయన తరపును మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రులు దానం నాగేందర్, సబితా ఇంద్రారెడ్డి ఆయన వద్దకు వెళ్లారు. 

మంత్రులతో రోశయ్య మాట్లాడుతూ... వైఎస్ వర్థంతి వేడుకల్లో పాల్గొనలేక పోయినందుకు ఎంతో బాధగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ హఠత్పరిణామంతో మంత్రి దానం సీఎంను ఓదార్చారు. ముఖ్యమంత్రి అనారోగ్యం కారణంగా రేపు జరగాల్సిన పునరంకిత సభను రద్దు చేసుకున్నట్లు దానం నాగేందర్ వెల్లడించారు.

Wednesday, September 1, 2010

వైఎస్ బతికి ఉంటే ఎంతో సంతోషించేవారు: మన్మోహన్

తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచే పనులకు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కృషి ఫలితంగా ఈ రోజున ఇక్కడ రెండు ప్రాజెక్టులకు శంకుస్థాన చేయడం జరిగిందన్నారు. అందులో ఒకటి మన్నవరంలో ఎల్టీపీసీ-భెల్ విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టు కాగా, రెండోది తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం పనుల ప్రారంభమన్నారు.

ఈ రోజున దివంగత నేత వైఎస్ బతికి వుంటే ఎంతో సంతోషించేవారన్నారు. సెప్టెంబరు రెండో తేదీన రాజశేఖర్‌ రెడ్డి మొదటి వర్థంతిని గుర్తు చేసిన ప్రధాని.. ఈ సందర్భంగా ముందుగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి దేశంలో ఉన్న అతిగొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒకటన్నారు. ఇక్కడకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వస్తుంటారన్నారు. అందువల్లే ఇక్కడ అంతర్జాతీ టెర్మినల్ నిర్మించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిపారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం ఎంతో సంతోషించదగిన విషయంగా ప్రధాని మన్మోహన్‌ అన్నారు. కాగా, తిరుపతి విమానాశ్రయ అభివృద్ధికి ఈ ఏడాది రూ.174 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందని ఆయన గుర్తు చేశారు.

అంతకుముందు ముఖ్యమంత్రి కె.రోశయ్య సందేశాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రఫుల్ పటేల్, వీరప్ప మొయిలీ, వనబాక లక్ష్మి, విలాస్ రావ్ దేశ్‌ముఖ్, సుషీల్ కుమార్ షిండే, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

వైఎస్ లేని ఏడాది పాలనలో... ఆంధ్ర రాజకీయాలు



అపర భగీరథునిగా, పేదలపాలిట పెన్నిధిగా, రైతుజన బాంధవునిగా జన హృదయాలలో నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన రాష్ట్రాన్ని వీడి ఏడాది గడిచింది. అయినా ఆయన జ్ఞాపకాలను మాత్రం ప్రజలు వీడలేకపోతున్నారు. ఆయన లేని లోటును తీర్చే శక్తి ఏ నాయకునికీ లేదంటే వైఎస్సార్ ప్రజల హృదయానికి ఎంత చేరువయ్యారో అర్థమవుతుంది. 
ఆయన గతించిన రెండు నెలలకే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పుట్టింది. ఆ వెంటనే సమైక్యాంధ్ర ఉద్భవించింది. ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను బలి పెట్టారు. తీరని శోకం మిగిల్చారు. మరోవైపు ప్రకృతి ప్రకోపించింది. అభివృద్ధిలో అగ్రపథాన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా అధఃపాతాళానికి దిగజారింది. 
అన్నిటినీ ఒక దారిలో నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నా వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపించింది ఈ ఏడాది కాలంలో. అటువంటి జనరంజక పాలనను అందించే నేతను కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిలోనూ చూడలేకపోతోందంటే ఆయన శక్తి ఎంతటితో అర్థమవుతుంది. 
గత ఏడాది సెప్టెంబరు 2న వైఎస్సార్ ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో సహా ఇద్దరు పైలెట్లు కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగి రాని లోకాలకెళ్లారు. ఆయన మరణం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని సృష్టించింది. పదవిలో ఉన్నప్పుడే ఓ ప్రమాదంలో మరణించిన తొలి ముఖ్యమంత్రి వైఎస్సార్. తన హయాంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా రెండోసారి అధికారాన్ని తెచ్చిపెట్టిన నాయకుడు. అయితే అధికారం చేపట్టి నాలుగు నెలలు కూడా తిరగక ముందే మరణించడం ప్రజలను శోక సముద్రంలో ముంచింది. 
ఈ దశలో సీనియర్ నాయకుడుగా, ఆర్థికవేత్తగా పేరుగాంచిన రోశయ్యను ముఖ్యమంత్రిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్గానికి రుచించలేదు. తండ్రి వారసత్వంగా ఆయన కుమారునికే ముఖ్యమంత్రి పదవి దక్కాలని స్వయంగా సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరిణామంతో అధిష్టానం నివ్వెరపోయింది. 
ఇదిలావుండగానే జగన్ సొంత పార్టీ పాలనను మెల్లగా తూర్పార బట్టడం మొదలుపెట్టారు. వైఎస్ పథకాలు అమలు తీరుపై ధ్వజమెత్తారు. త్వరలో స్వర్ణయుగం వస్తుందని పరోక్షంగా రోశయ్య సర్కారుకు పొగ పెట్టారు. అలా వైఎస్ వర్గం, రోశయ్య వర్గంగా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. కాకపోతే పార్టీలోనే ఉంటూ హైకమాండ్ మాటను ధిక్కరిస్తూ ముందుకు వెళుతోంది జగన్ వర్గం. 
తన తండ్రి మరణ వార్త విని తనువు చాలించిన వ్యక్తుల కుటుంబాలను ఓదార్చాలన్న ధ్యేయంతో జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర వివాదాస్పదమైంది. ఈ ఓదార్పులో కుటుంబాలను ఓదార్చే విషయం ఎలాగున్నా, జగన్ తన స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని అధిష్టానం ఓ అంచనాకు వచ్చింది. 
పార్టీని, అధిష్టానాన్ని ఖాతరు చేయకుండా తన తండ్రి తన ఆస్తేననీ, ఆయన సాధించి తెచ్చిన సీఎం పదవీ తనకే కావాలన్న రీతిలో జగన్ ప్రవర్తన ఉంటోందని పలువురు సీనియర్ నాయకులు అధిష్టానం దృష్టికి పదేపదే తీసుకవెళ్లారు. దీతో కాంగ్రెస్ అధిష్టానం జగన్ ను పిలిచి ఓదార్పును వాయిదా వేసుకోవలసిందిగా సూచన చేసింది. అధిష్టానం మాటలను పట్టించుకోని జగన్ ఓ బహిరంగ లేఖ రాసి ఉత్తరాంధ్ర ఓదార్పుకు బయలుదేరారు. 
మొన్నటివరకూ ఏమీ పట్టనట్లు ఉన్న అధిష్టానం జగన్ వైఖరిపై దృష్టి సారించి రంగంలోకి దిగింది. వైఎస్ మరణవార్త విని తట్టుకోలేక తనువు చాలించిన వ్యక్తుల కుటుంబాలను తాము ఓదార్చుతున్నట్లు ప్రకటించింది. ఆర్థిక సాయం లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఓదార్పు అంటే డబ్బు ఇవ్వడమే కాదనీ, కన్నీళ్లు తుడవడమని అధిష్టానానికి పాఠాలు చెప్పారు జగన్. 
ఇవన్నీ ఇలావుంటే తెలంగాణా సమస్యను తెరాస నిత్యం రగిల్చుతూనే ఉంటోంది. రాష్ట్రంలో ఏమూల ఏ చిన్న అవకతవక జరిగినా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అక్కడ ప్రత్యక్షమై అధికార పక్షాన్ని తూర్పారబడుతున్నారు. ఇక పీఆర్పీ స్నేహంగా ఉంటున్నా అంటూనే వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇలా ఏ పార్టీకాపార్టీ ముఖ్యమంత్రి రోశయ్య కంటిపై కునుకులేకుండా చేస్తున్నారు. 
వీరందరూ ఒక ఎత్తైతే వైఎస్ జగన్ ఓదార్పు రోశయ్యకు పెద్ద తలనొప్పిగా మారింది. తనపై ప్రత్యక్షంగా మాటల యుద్ధాన్ని చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా అంతా అధిష్టానమే చూసుకుంటుందని ఓర్పుగా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు రాజకీయ కురువృద్ధుడు ముఖ్యమంత్రి రోశయ్య.
మొత్తమ్మీద వైఎస్సార్ లేని ఏడాది కాలం అనేక అల్లర్లు, ఎన్నో రాజకీయ ఎత్తులు, మరెన్నో అవినీతి కుంభకోణాలతో 
సాగింది. మరి నెక్ట్స్ ఏంటో.???
                                                                                                                                                                        

అంతా వైఎస్సార్ క్రెడిట్టే: మన్నవరంలో మన్మోహనాస్త్రం!

ఒక రోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కొనియాడారు. మన్నవరం ప్రాజెక్టు చిత్తూరు జిల్లాలో నెలకొల్పడానికి వైఎస్సార్ కారణమని చెప్పుకొచ్చారు. ఆయన గట్టిపట్టుదలతో కృషి చేయకుంటే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కేది కాదనే భావన వచ్చేలా సింగ్ వ్యాఖ్యానించారు. 

తన ప్రసంగం ఆరంభం నుంచే వైఎస్‌పై పొగడ్తల జల్లు కురిపించారు. అలాగే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రులు సుషీల్ కుమార్ షిండే, విలాస్ రావ్ దేశ్‌ముఖ్‌ (కాంగ్రెస్)లు కూడా వైఎస్ కృషిని కొనియాడారు. తామిద్దరం మహారాష్ట్రకు చెందిన మంత్రులమైనప్పటికీ.. ప్రాజెక్టును తమకు దక్కనీయకుండా వైఎస్ చేశారని చమత్కరించారు. 

అయితే, దేశ ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్సార్‌ను ఆకాశానికి ఎత్తేయడమే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ప్రస్తుతం వైఎస్ హఠాన్మరణం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజుకో రీతిలో మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ తనయుడు, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ తన పంథాలో ముందుకు సాగుతున్నారు. 

వైఎస్ తర్వాత స్థాయిలో ప్రజాదారణను సొంతం చేసుకోవడమే కాకుండా తాను అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే ధోరణిని కనబరుస్తున్నారు. ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ. ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. 

ఈ నేపథ్యంలో వైఎస్‌ను పార్టీ ఆస్తిగా కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఇపుడు ప్రధాని నోటి వెంట వైఎస్‌ను ప్రస్తుతిస్తూ వ్యాఖ్యలు రావడం కూడా వైఎస్ అభిమానులను ఎంతో ఆనందానికి లోను చేశాయి. మన్నవరం ప్రాజెక్టు దక్కడానికి వైఎస్సే కారణమని ప్రధాని చెప్పారు. 

అంతేకాకుండా, వైఎస్‌ను కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నేతగా చూసిందని, ఆయన చెప్పినట్టుగా తాము నడుచుకున్నామని ప్రధాని తన మాటల ద్వారా చెప్పారు. తద్వారా వైఎస్ పట్ల, ఆయన కుటుంబం పట్ల పార్టీ వివక్ష చూపిస్తుందని జరుగుతున్న ప్రచారానికి తెరదించేలా మన్మోహనాస్త్రాన్ని ఈ రాజకీయ ఆర్థికవేత్త సంధించి కాంగ్రెస్ శ్రేణులకు,  వైఎస్ అభిమానులకు బలమైన సందేశాన్ని పంపడంలో సఫలీకృతులయ్యారు.