Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Monday, September 20, 2010

వైస్సార్ విగ్రహ ప్రతిష్టాపనకోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీక్ష

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పరిధిలో వైఎస్సార్ కు చెందిన ఒక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపించకుండా కొంతమంది కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్ వర్గీయుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి ధ్వజమెత్తారు. విగ్రహ ప్రతిష్టాపనకు అనుమతి ఇవ్వాలంటూ పాకాల తహశిల్దార్ ఆఫీసు ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు.

దివంగత నేత విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు తాను ముందుకు వస్తుంటే, మంత్రి గల్లా అరుణ కుమారి మోకాలడ్డుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్టించే వరకూ తన పోరాటం ఆగదని హెచ్చరించారు.

అయితే పాకాల తహశిల్దార్ ఆఫీసు ఎదుట నుంచి చెవిరెడ్డి తక్షణం వెళ్లిపోవాలంటూ గల్లా అరుణ కుమారి వర్గీయులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

ఇప్పటికి సీఎం రోశయ్యే.. కానీ 2014 సీఎం జగన్: బాలినేని

రాష్ట్రమంత్రి బాలినేని శ్రీనివాసరావు వైఎస్ జగన్ రాజకీయ భవితవ్యం గురించి విపులీకరించారు. రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోశయ్య ఇప్పటికి.. అంటే 2014 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. ఆ తర్వాత అంటే... 2014లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

నిజానికి ముఖ్యమంత్రి రోశయ్య కుర్చీలో కూచోవాలని ఆయన వెంట ఉన్న సీనియర్ నాయకులే కొందరు ఆరాటపడుతున్నారన్నారు. కానీ తామలా కాదన్నారు. మరో ఏడాదిన్నర కాలం పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు సాగుతుందనీ, ఇక చివరిగా రెండేళ్లు మిగిలి ఉంటుంది కనుక 2014 నాటికి పూర్తిస్థాయిలో జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూచోబెట్టే కసరత్తు సాగుతుందన్న ధోరణిలో ఆయన మాట్లాడారు.

మొత్తమ్మీద వైఎస్ జగన్ ఓదార్పు ఎంతకాలం సాగుతుందోనని ఆలోచిస్తూ బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నవారికి మంత్రి బాలినేని మంచి కబురు చెప్పారు.

ఐ లవ్ లగడపాటి: కేసీఆర్‌కు సంస్కారం తెచ్చిన తంటా!!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ఉద్యమకారుల ఆగ్రహానికి లోనయ్యారు. నిన్నటి వరకు జైకొట్టిన ఉద్యమకారులు.. నేడు కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసే స్థాయికి వచ్చారు. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌ నిర్వహించిన చర్చా వేదికలో కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తకర పరిస్థితులకు దారితీశాయి. అదేసమయంలో తెలంగాణలోని సీమాంధ్ర ప్రజానీకాని భరోసా ఇచ్చేలా ఉన్నాయి. మొత్తంమీద రాజకీయ ప్రజా జీవితంలో ఉండే నేతలు చేసే వ్యాఖ్యలు ఎంతటి ఉపద్రవానికి తీయగలవో కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

తెలంగాణలో పుట్టినవారు ఇక్కడి వారేనని, వారు అన్ని ఉద్యోగాలకు, పదవులకు, హక్కులకు పూర్తి అర్హులని కేసీఆర్ అన్నారు. పైపెచ్చు.. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కరుడుగట్టిన సమైక్యవాది, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను కేసీఆర్ పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. సమైక్యాంధ్ర హీరోగా అభివర్ణించారు. అందుకే లగడపాటిని "ఐ లవ్ యూ" అని కేసీఆర్ ప్రేమగా అన్నారు.

'స్థానికం' అంశంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కొంతమంది ఉద్యమకారులు వ్యతిరేకిస్తుంటే... తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన లగడపాటిని పొగడ్తల వర్షంలో ముంచెత్తడం ప్రతి తెలంగాణ పౌరుడిని, ఉద్యమకారుడిని ఆగ్రహోద్రుక్తుడిని చేస్తున్నాయి. ఫలితంగా కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనాలకు దారితీస్తూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం నాటకీయంగా కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు దిగగా, అంతే నాటకీయ పరిణామాల మధ్య విజయవాడ నుంచి హైదరాబాద్‌ నిమ్స్ ఆస్పత్రిలో లగడపాటి పరుగు పెట్టారు. ఈ దృశ్యాలు తెలంగాణవాదుల్లోనే కాకుండా, సమైక్యాంధ్ర వాసుల కళ్లలోనూ ఇంకా కదలాడుతూనే ఉన్నాయి.

అంతేకాకుండా, తెలంగాణ ఏర్పాటుకు ప్రథమ శత్రువు లగడపాటి (కేసీఆర్ భాషలో జగడపాటి) అని ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు భావిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ప్రేమిస్తున్నానని కేసీఆర్ చర్చావేదికలో చెప్పడం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే దిష్టబొమ్మలు దహనం చేస్తూ, భేషరతు క్షమాపణ చెప్పాలని కేసీఆర్‌ను డిమాండ్ చేస్తున్నారు. లగడపాటితో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ప్రధానంగా, తెరాస (కేసీఆర్) రాజకీయ ప్రయోగశాలగా మారిన ఉస్మానియా విద్యార్థి జేఏసీ కూడా కేసీఆర్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

అదేసమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, లగడపాటితో వ్యవహరించిన తీరును మరికొందరు సమర్థిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో నివశిస్తున్న సీమాంధ్ర వాసులకు కేసీఆర్ భరోసా కల్పించాలన్న విశాలదృక్పథంతో అలా వ్యాఖ్యానించారని వివరణ ఇస్తున్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులను హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఉండనివ్వరని లగడపాటి వంటి సమైక్యవాదులు ప్రజల్లో నూరిపోస్తున్నారు. ఇది వేర్పాటువాద ఉద్యమకారులకు మింగుడుపడటం లేదు. దీనికి చెక్ పెట్టాలన్న ఏకైక ఉద్దేశ్యంతోనే కేసీఆర్ అలా వ్యాఖ్యానించారని వారు వివరణ ఇస్తున్నారు.

అంతేకాకుండా, తనపై విమర్శలు చేస్తున్న వారిపై కేసీఆర్ విమర్శలు గుప్పిస్తూనే.. ఓ విజ్ఞప్తి కూడా చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడంమాని విశాల దృక్పథంతో చూడాలని కోరారు. మొత్తానికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, రాజకీయ ప్రత్యర్థుల పట్ల చూపిన సంస్కారం సొంతగడ్డపై విమర్శలకు దారితీయగా, సీమాంధ్రులు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా, వారి అభిమానాన్ని చూరగొన్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Thursday, September 16, 2010

తెలంగాణా రాదు.. అందుకే 42 శాతం వాటా పోరు..!!

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఓ దిక్కుమాలిన కమిటీ, పనికిమాలిన కమిటీ అనీ ఆ కమిటీ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ అంటూనే ఉన్నారు. డిసెంబరు 31 తర్వాత తెలంగాణాలో భూకంపం వస్తుందనీ చెపుతున్నారు. అంటే శ్రీకృష్ణ కమిటీ తెలంగాణాకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తుందని అనుకోవాలా..? అనుకోవాలన్నట్లుగానే కేసీఆర్ వ్యాఖ్యలు ఉంటున్నాయి.

కేసీఆర్ వ్యాఖ్యల వల్లనైతేనేమీ.. మరి దేనివల్లనైతేనేమి.. ఇపుడు తెలంగాణా ప్రాంతంలో తమకు దక్కాల్సిన వాటాకోసం పోరాటాలు మొదలయ్యాయి. తొలుత గ్రూప్-1తో ప్రారంభమైన ఈ పోరు ప్రస్తుతం న్యాయాధికారుల నియామకాల్లో వాటా కోరేంత వరకూ వచ్చింది.

మరో మూడు నెలల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వనున్న తరుణంలో వాటాకోసం కీచులాట ఎందుకో..? అని తరచి చూస్తే.. రెండు అంశాలు బోధపడతాయి. అందులో ఒకటి.. కేసీఆర్ అన్నట్లు కమిటీ నివేదిక పనికిమాలింది... అంటే ఆయన ఉద్దేశ్యం కమిటీ తెలంగాణాకు మద్దతు ఇవ్వదన్నదే. కనుక మన వాటా మనం దక్కించుకుందామన్న పట్టుదలతో తెలంగాణా ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు.

మరొక నిగూఢమైన అంశం ఏమిటంటే.. 42 శాతం వాటా అడిగితే.. ప్రభుత్వం ఇవ్వదు.. కనుక రేపు... అంటే డిసెంబరు నాటికి వీటన్నిటినీ సాకుగా చూపించే యత్నంలో భాగంగా ఈ వాటా పోరు అంటున్నారు కొంతమంది. వ్యూహాత్మకంగా వరుసగా తెలంగాణా ప్రాంతంలోని కొంతమంది నాయకులు వివిధ సంస్థలు, వర్గాలను వాటాకోసం పోరు చేయాలని చెపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎలాగూ రాష్ట్రం వాటాలను ఇప్పటికిప్పుడు తేల్చలేదు కనుక.. వచ్చే డిసెంబరు నాటికి వీటన్నిటినీ అస్త్రాలుగా చేసుకుని సీమాంధ్ర నాయకుల మెడలు వంచి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించవచ్చనేది యోచన. మరి ఈ ఫార్ములా సక్సెస్ అవుతుందో లేదంటే ఫెయిల్ అవుతుందో చూడాలి.

Wednesday, September 15, 2010

శాంతికి చర్చలే పరిష్కార మార్గం: ప్రధాని మన్మోహన్

కాశ్మీర్‌లో శాంతి నెలకొనడానికి చర్చలు ఒక్కటే పరిష్కారమార్గమని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు ఫలప్రదంగా జరగాలన్నా, ముగియాలన్నా హింస పూర్తిగా సద్దుమణిగి పోవడమే కాకుండా, సంఘర్షణకు తావులేని ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఆయన అన్నారు.

కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై బుధవారం ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగిన విషయం తెల్సిందే. ఇందులో అన్ని పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాశ్మీర్ సమస్య పరిష్కారానికి రాజ్యాంగ పరిధిలో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

ఇందుకోసం హింసకు ప్రేరేపించని ఏ పార్టీతో అయినా, గ్రూపుతో అయినా చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాశ్మీర్‌ లోయలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ఆ రాష్ట్రానికి చెందిన వివిధ రాజకీయ పార్టీ నేతలు అమూల్యమైన సూచలనలు, సలహాలు ఇచ్చారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.

అలాగే, హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. గత కొంతకాలంగా చెలరేగిన అల్లర్లు, హింసాకాండ వల్ల అన్ని వర్గాల వారికి తీరని నష్టం జరిగిందని, అందువల్ల లోయలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మావూరికి కూడా ప్రత్యేక పీసీసీ కావాలి: జేసీ.దివాకర్

తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ప్రత్యేక పీసీసీపై మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణకు మాత్రమే కాకుండా మావూరికి కూడా ప్రత్యేక పీసీసీ కావాలన్నారు.

ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు గవర్నర్‌ నరసింహన్‌ను కలవడంలో తప్పులేదన్నారు.

ఇకపోతే రాష్ట్ర ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందుతున్నాయా లేక ఒకరిద్దరికి మాత్రమే చెందుతున్నాయా అనేది చూడాల్సి వుందన్నారు. పలు అంశాలపై ప్రభుత్వం, పోలీసులు చేయాల్సిన పనిని మీడియా చేస్తోందన్నారు

తెలుగుతల్లిని ఈ ఆంధ్రోళ్లు సృష్టించిండ్రు: కేసీఆర్

రాష్ట్రంలో ఈ తెలుగుతల్లిని ఈ ఆంధ్రోళ్లు వచ్చి సృష్టించిండ్రని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలు వందేళ్ళ క్రితమే తెలంగాణ తల్లి గురించి గీతాలు రాసి పాటలు పాడుకున్నారని, మధ్యలో వచ్చిన తర్వాత అది కనుమరుగై పోయిందని కేసీఆర్ ఆరోపించారు.

దౌల్తాబాద్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని బుధవారం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండలేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలు సుఖంగా ఉంటారని, తెలంగాణకు జరిగిన ఏ అన్యాయం విషయంలోనైనా న్యాయం జరిగిందా అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ జిల్లాల్లో ఎరువులు లభించక రైతులు అష్టకష్టాలు పడుతుంటే సీమాంధ్రలో మాత్రం భారీ ఎత్తున అక్రమ ఎరువులు బయటపడుతున్నాయని ఆయన ఆరోపించారు. అలాగే, ఈ ప్రాంత లాయర్లు తమ న్యాయమైన వాటా కోసం పోరాటం చేస్తుంటే పోలీసులతో ఆ ఆందోళనను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు

అక్టోబర్‌లో ఛార్మింగ్ గర్ల్ ఛార్మి కొత్త చిత్రం ప్రారంభం!

గురుదేవ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఛార్మింగ్ గర్ల్ ఛార్మి నటించే కొత్త చిత్రం వచ్చే నెలలో మొదలు కాబోతోంది. ఈ చిత్రాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారి నంది శ్రీహరి నిర్మిస్తున్నారు.

టేకుల ముక్తిరాజ్ కో ప్రొడ్యూసర్, పరుచూరి బ్రదర్స్ శిష్యుడు ప్రేమ్‌రాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. వర్తమాన రాజకీయాలు, సామాజికాంశాల మేళవింపుగా తయారయ్యే ఈ చిత్రం ఛార్మికి కొత్తగా ఉంటుందని ప్రేమ్‌రాజ్ తెలిపారు.

ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా చిత్రాలకు కథను అదించిన దీన్‌రాజ్ ఈ చిత్రానికి నవ్యతతో కూడిన కథను అందించారు. పరుచూరి బ్రదర్స్ చక్కటి సంభాషణలు రాస్తున్నారు. కృష్ణాజీ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే మూడు పాటల రికార్డింగ్ పూర్తయ్యాయి.

ఈ చిత్రంలో మహాదేవన్, హరిహరన్, బాలు, గోరటి వెంకన్న పాటలు హైలైట్‌గా నిలుస్తాయని ప్రేమ్‌రాజ్ అన్నారు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

రోశయ్య సర్కారు ఆ పని ఎందుకు చేయలేదు: గట్టు

మహబూబ్‌నగర్ పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అడ్డుకోబోయిన వారిపై లాఠీఛార్జీ ప్రయోగించి వెళ్లగొట్టిన రోశయ్య సర్కారు, కడప ఎంపీ జగన్మోహన రెడ్డి మహబూబ్‌నగర్ ఘటనలో ఎందుకు ఆ పని చేయలేకపోయిందని గట్టు రామచంద్రారావు ప్రశ్నించారు. దీనిని బట్టి జగన్ మహబూబ్‌నగర్ పర్యటనను ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగానే అడ్డుకుందని రామచంద్రారావు విమర్శించారు.

ఇందులో చంద్రబాబుకో నీతి.. జగన్‌కో రీతా అని గట్టు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగే హక్కుందనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలన్నారు.

సున్నితమైన అంశమైనందున జగన్ వరంగల్ వెళ్లకపోయి ఉంటేనే బాగుండేదని చెప్పిన చంద్రబాబును నేడు అదే ప్రశ్న అడిగి ఉంటే ఏం సమాధానం చెబుతారని గట్టు ప్రశ్నించారు.

రైతుల ఎరువుల కోసం మహబూబ్‌నగర్ వెళ్లిన చంద్రబాబుకు తన హయాంలో విద్యుత్ బిల్లులు కట్టలేదనే సాకుతో రైతులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఆత్మహత్యలకు పురిగొల్పిన విషయం గుర్తుకురాకపోవడం విడ్డూరంగా ఉందని రామచంద్రారావు అన్నారు.

తెదేపా అధినేత ప్రెస్‌మీట్‌కు తితిదే అనుమతి నిరాకరణ!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించాల్సిన మీడియా సమావేశానికి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు అనుమతి నిరాకరించారు. అలిపిరి దాడి కేసులో కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు తిరుపతి చేరుకున్న చంద్రబాబు పద్మావతి అతిథి గృహంలో బస చేశారు.

అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. అయితే, మీడియా సమావేశానికి అనుమతిలేదని తితిదే అధికారులు బాబుకు చెప్పారు. అధికారుల చర్యకు ఆయన విస్తుపోయారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి.

గతంలో తిరుపతి ఎమ్మెల్యే, ప్రరాపా అధినేత చిరంజీవి పద్మావతి అతిధిగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, ఇప్పుడు తమ నేతకు ఎందుకు అనుమతి ఇవ్వరని తెదేపా శ్రేణులు ప్రశ్నించాయి. అయితే, దీనికి అనుమతి ఇవ్వాల్సింది ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తితిదే స్పెసిఫైడ్ అథారిటీ అని అధికారులు

రాష్ట్రంలో వచ్చే యేడాది ఆరంభంలో రాష్ట్రపతి పాలన!?

రాష్ట్ర పరిస్థితులు రోజుకో విధంగా మారిపోతున్నాయి. శాంతిభద్రతలు క్షీణించి పోతున్నాయి. వేర్పాటువాదులు ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. ఇది వారి దినచర్యగా మారింది. పైపెచ్చు కీలక విషయాలపై త్వరితగతిన, ఖచ్చితమైన నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకోలేక పోతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే, పైకి మాత్రం రాష్ట్ర సర్కారు పనితీరు బాగానే ఉందని గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు పదేపదే చెపుతున్నారు. వీరికి వాస్తవ పరిస్థితులు ఏమిటో బాగానే తెలుసని పలువురు నేతల వాదన. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటన వల్ల రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

వీటికి తోడు గత యేడాది కాలంగా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి మందగించింది. పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్క కంపెనీ సాహసం చేయడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. అలాగే, తెలంగాణ ప్రాంతంలో ఏదో ఒక చోట బంద్‌లు, ఘర్షణలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగానే నష్టం వాటిల్లుతుంది. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కొద్ది రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించి పరిస్థితులను చక్కదిద్దడమే కాకుండా, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమకారుల పీచమణచాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

ఇదిలావుండగా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి కేంద్రానికి నివేదికలు పంపుతున్నారు. ఇందులో గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి సంఘటనలను ఆయన ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం. వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు కూడా వారానికొకటి చొప్పున నివేదికలు ఇస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రజల్లో అభద్రతాభావం పెరిగిపోతోందన్నది ఈ నివేదికల ప్రధాన సారాంశంగా ఉంది.

అటు గవర్నర్ - ఇటు కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికలను కేంద్ర సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, రాష్ట్రంలో పరిస్థితుల అధ్యయానికి కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ డిసెంబరు 31వ తేదీలోపు తన నివేదికను సమర్పించనుంది. ఈ నివేదిక ఎలా ఉన్నప్పటికీ.. ఏదో ఒక ప్రాంతంలో అల్లర్లు చెలరేగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఖాయమని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.

పైపెచ్చు.. జనవరి తర్వాత విద్యార్థులకు పరీక్షా సమయం. అందువల్ల ప్రత్యేక, సమైక్యాంధ్ర ఉద్యమాల ఆందోళనలు తీవ్రతరమైతే విద్యార్థులు తమ కెరీర్‌ను కోల్పోయే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేస్తున్న కేంద్రం.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత రాష్ట్రపతి పాలన విధించాలని భావిస్తోంది. ఇలా చేయడం వల్ల శాంతిభద్రతలు అదుపులోకి వస్తాయన్నది కేంద్ర భావనగా ఉంది. అందువల్ల కొత్త యేడాదిలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్టు ఢిల్లీ వర్గాల భొగొట్టా.

కేసీఆర్ చేతుల్లో తెలంగాణాను పెడితే 10 జన్‌పథ్‌కు అమ్మేస్తాడు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై రంగారెడ్డి జిల్లాలో జరిగిన దాడి నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తెలంగాణా తన సొత్తన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారనీ, ఒకవేళ తెలంగాణాను కేసీఆర్ చేతుల్లో పెడితే ఒక శుభముహూర్తాన 10 జన్‌పథ్‌కు తాకట్టు పెట్టడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నాయకుడు నామా నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు. 

తెలంగాణా నుంచి ఎన్నోసార్లు ఎంపీగా ఎన్నికైనా కేసీఆర్, తెలంగాణా గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదనీ, ఎందుకంటే ఆ సమయంలో ఆయనకు పదవి ఉండటమే కారణమన్నారు. ఇపుడు చేతిలో ఏమీ లేకపోవడంతో ఆయన తన స్వార్థంకోసం తెలంగాణా ఉద్యమాన్ని ఉపయోగించుకుంటున్నారన్నారు.

తెలంగాణాలో విద్యార్థుల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్నవారిలో కేసీఆర్ ప్రథమ స్థానంలో నిలుస్తారని మరో తెదేపా నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. 

అయినా తెలంగాణాకోసం తమ పార్టీ ఒక్కటే పోరాటం చేస్తోందంటూ సీన్లు ఇచ్చుకునే దశకు కేసీఆర్ రావడం ఆశ్చర్యకర్యమనీ, త్వరలో ఆయన అతితెలివి చేష్టలకు తెలుగుదేశం పార్టీ కళ్లెం వేస్తుందన్నారు.

Sunday, September 12, 2010

డిసెంబరు 31 తర్వాత రాష్ట్రంలో భూకంపం: కేసీఆర్

Aడిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమం సృష్టిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని పూర్తిగా స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజల ఆక్రోశం, ఆగ్రహాన్ని చవిచూడక ముందే అన్నదమ్ముల్లా విడిపోయేందుకు సీమాంధ్ర నేతలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభాసుపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంతంలో కొమరం పులి చిత్రాన్ని విడుదలకు తెలంగాణ విద్యార్థులు డబ్బు డిమాండ్ చేసినట్టు చెపుతున్న చిరంజీవి.. ఆ విధంగా డిమాండ్ చేసిన వారి పేర్లను వెల్లడించాలని ఆయన కోరారు. 

ఆరోపణలు చేయడం మాని డబ్బులు డిమాండ్ చేసిన వారి పేర్లను చిరంజీవి బహిర్గతం చేయాలని ఆయన సవాల్ విసిరారు. లేకుంటే చిరంజీవి ముక్కును నేలకు రాసి తెలంగాణ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. 

ఇకపోతే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలపై ఆయన దుమ్మెత్తి పోశారు. తెలంగాణకు అనుకూలమని చెప్పుకుంటున్న తెదేపా తెలంగాణ సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడుతో జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక ఇప్పించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
మరి సీమాంధ్ర నేతలు కేసీఆర్ వ్యాక్యాల ఫై ఎలా స్పందిస్తారు ??? 

వసూళ్ళ కోసమే తెరాస ఆవిర్భవించింది: టీజీ.వెంకటేష్



తెలంగాణ రాష్ట్ర సమితి డబ్బు వసూళ్ళ కోసమే ఆవిర్భవించిందని రాయలసీమ హక్కుల వేదిక కన్వీనర్ టి.జి.వెంకటేష్ ఆరోపించారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో కోల్పోయిన భూమికి పరిహారంగా టి.జి.వెంకటేష్‌ విలువైన భూమి పొందారని తెరాస ఎమ్మెల్యే హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలపై టీజీ ఆదివారం స్పందించారు. 

దీనిపై ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఓటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం తన భూమిని స్వాధీనం చేసుకుందన్నారు. ఇలా భూములను స్వాధీనం చేసుకున్న వారందరికీ ఒకచోట తనకు మరోచోట ప్రభుత్వం భూమిని కేటాయించారని గుర్తు చేశారు. 

అయితే, కొందరితో తెరాస నేత హరీష్ రావు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెరాస భవనం ఉన్న భూమి న్యాయమైనదో, తన భూమి న్యాయమైనదో తేల్చుకోవడానికి రావాలని ఆయన సవాల్‌ విసిరారు. ఆ భూమి విషయంలో ఏ విచారణకైనా తాను సిద్ధమేనని ఆయన ప్రకటించారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే డబ్బు వసూళ్ళ కోసమని వెంకటేష్ ఆరోపించారు.

Monday, September 6, 2010

విద్యార్థులను తప్పుదోవ పట్టించారు : ఏపీపీఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి

రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టించారు. 42 శాతం వాటా కోసం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను అడ్డుకోవాల్సిన పని లేదని ఏపీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ వై వెంకట్రామిరెడ్డి చెప్పారు. సోమవారం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని వెంకట్రామిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలను నెల రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. మార్చిలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈలోగా 42 శాతం వాటా కోసం రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చుకోవచ్చన్నారు. తనపై ఆరోపణలు చేసేవారిపై జవహార్ కమిటీ ఐదు పేజీల నివేదిక అందజేసిందని, దీనిలో వారి పురాణం బయట పడుతుందన్నారు.

త్రికోటేశ్వరుని సన్నిధిలో కుటుంబ సభ్యులపై ప్రమాణం చేసి చెపుతున్నానని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడ లేదన్నారు. గ్రూపు-1 చరిత్రలోనే రికార్డు స్థాయిలో అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు.

విద్యార్థులకు అన్ని స్థాయిల్లో పరీక్షలు పూర్తయ్యే వరకు మార్కులు చూసే అవకాశం వుండదన్నారు. ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన విద్యార్థులు మొన్నటి వరకు కార్పొరేట్ రంగంపై ఆసక్తి చూపారని, అక్కడ ఉద్యోగ అవకాశాలు దెబ్బతినటంతో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి సారించారన్నారు.

అందరి కన్నా ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థులు అత్యధిక ప్రతిభ చూపుతారన్నారు. వారు చెప్పే ప్రకారం 42 శాతం అంటే 80 ఉద్యోగాలు తెలంగాణ వారికి ఇవ్వాలని, 160 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలవాల్సి వుంటుందని, కాని అంతకంటే ఎక్కువ మంది ఉస్మానియా విద్యార్థులు ఇంటర్వ్యూలకు ఎంపిక అవుతారన్నారు. దీనికి కారణం వారికి నగరంలో ప్రత్యేక వసతులు వుండటమేనని ఆయన వివరించారు.

గిట్టనివాళ్లు,కొన్ని పత్రికలు నాపై వ్యతిరేక ప్రచారం - వై ఎస్ జగన్

నేనంటే గిట్టనివాళ్లు, కొన్ని పత్రికలు పనిగట్టుకొని తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని కడప ఎంపీ వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలో ఓదార్పుయాత్రలో భాగంగా నాల్గోరోజు సోమవారం కనిగిరి నియోజకవర్గంలోని పామూరు, పీసీ పల్లి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పీసీ పల్లి మండలం మిట్టమీదపల్లి గ్రామంలో మృతి చెందిన కరణం వెంకటసుబ్బయ్య కుటుంబాన్ని ఓదార్చారు.పలు గ్రామాల్లో వై.ఎస్ విగ్రహ ఆవిష్కరణలు చేశారు.పామూరు పట్టణంలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ నేను ఒంటరివాడిని కాదని, నా తండ్రి మరణిస్తూ తనకు పెద్ద కుటుంబాన్ని అప్పచెప్పారన్నారు. తనంటే గిట్టనివాళ్లు, కొన్ని పత్రికలు ఎంత చేసినా తనకు ప్రజలు మద్దతు ఉందన్నారు.మంత్రులు, ఎమ్మెల్యేలు నా చుట్టూ ఉంటేనేనా ప్రజలు తనపై ఆదరాభిమానాలు చూపేదని ప్రశ్నించారు.

గత పది నెలలుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుక దా అన్నారు. తన తండ్రి వై.ఎస్ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు. రాష్ట్ర భూగర్భ గనుల శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ పావురాళ్లగుట్టలో జగన్ ఇచ్చినమాటకు నిలబడి ఓదార్పుయాత్ర చేపట్టారని అన్నారు. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ఓదార్పుయాత్ర జరిగి తీరుతుందన్నారు. వై.ఎస్ అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పధకాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వైవి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డిలు పాల్గొన్నారు

తెరాస తొత్తులుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు: అనంత

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు తొత్తులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీలు వ్యవహరిస్తున్నారని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ బ్రిగేడ్ అంటూనే కేసీఆర్‌తో కుమ్మక్కవుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

గ్రూప్-1 పరీక్షల నిర్వహణ అంశంపై తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలందరూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. వీరిపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, ప్రజాప్రతినిధులు తప్పుబట్టారు.

ఈ అంశంపై ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సోనియా బ్రిగేడ్ అంటూనే కేసీఆర్ గుమ్మం వద్ద తమ పార్టీ ఎంపీలు కావలి కాస్తున్నారన్నారు. పేరుకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ లోపల మాత్రం కేసీఆర్‌తో రహస్య అవగాహన కుదుర్చుకున్నారని ఆరోపించారు.

ఈ అంశంపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం అనుసరించిన కఠిన వైఖరిని ఎంపీ అనంత సమర్థించారు. ముఖ్యమంత్రి రోశయ్య ప్రతి విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

నెల్లూరులో చీలిన వైఎస్సార్ వర్గం: "ఓదార్పు" ఎఫెక్ట్

ఓదార్పు యాత్రపై కాంగ్రెస్ అధిష్టానం నిర్దేశించిన బలమైన ఆదేశం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్గాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రకాశం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్ ఓదార్పుకు మద్దతు మాత్రమే ఇవ్వకుండా దూరంగా ఉంటే, నెల్లూరులో ఒకడుగు ముందుకేసి వైఎస్సార్ విగ్రహ ప్రతిష్టాపన అడ్డుకునే వరకూ వెళ్లింది. 

వైఎస్ వీరవిధేయులుగా పేరు సంపాదించుకున్న నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ ఓదార్పుకు నెల్లూరులో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ విగ్రహ ప్రతిష్టాపనకు జగన్ వర్గం సోమవారం నెల్లూరు సెంటర్‌లో తవ్విన కుంటను పోలీసులు సమక్షంలో అధికారులు పూడ్చి వేశారు. దీంతో వైఎస్సార్ వర్గంలో అభిప్రాయభేదాలు భగ్గుమన్నాయి. 

వైఎస్ వర్గంగా పేరున్న ఆనం బ్రదర్స్‌కు మేకపాటి వర్గానికి మధ్య చిచ్చు రగిలిందన్న వాదనలు వినబడుతున్నాయి. అయితే మేకపాటి మాత్రం తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని చెపితే.. ఆనం వివేకానంద రెడ్డి మాత్రం ఎవరి పేరు చెప్పకుండా విమర్శలు గుప్పించారు. 

కొన్ని కాకులు, ఉడుతలు వంటి నాయకులు రాజకీయ లబ్దికోసం తమపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారన్నారు. నిజానికి వైఎస్ కుటుంబం అంటే తమకు ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు. వైఎస్ అన్న తమకు నేర్పిన పాఠాన్నే శిరసా వహిస్తున్నామన్నారు. 80 ఏళ్ల కాంగ్రెస్ పార్టీతోనూ, కాంగ్రెస్ అధిష్టానానికి వీరవిధేయులుగా ఉంటామన్నారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర ఆయన వ్యక్తిగత యాత్ర కనుక దానితో తమకు సంబంధం లేదన్నారు. 

విగ్రహ ప్రతిష్టాపనను తామేదో అడ్డుకుంటున్నామని ప్రచారం చేస్తున్న పిల్లకాకుల మాటలను తాము పట్టించుకోబోమన్నారు. తాము ఏటిలో తుంగలాంటి వారమనీ, వరద ఉధృతి వచ్చినపుడు తలవంచుతామనీ, ఆ ఉధృతి తగ్గిన తర్వాత తిరిగి తల ఎత్తుక తిరుగుతామన్నారు. కొంతమంది ఛోటా నాయకులు ఏదో ప్రాబల్యం పెంచుకునేందుకు ఆడుతున్న నాటకం తప్ప మరేమీ కాదన్నారు. నెల్లూరులో వైఎస్ విగ్రహాలు ఒకటి కాదు వందల్లో ప్రతిష్టాపన చేసినా తనకు ఆనందం తప్ప ద్వేషం రాదని చెప్పారు. 

వైఎస్సార్ వర్గమని కొంతమంది చెపుతుండటాన్ని కూడా ఆనం వివేకానంద రెడ్డి తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ వర్గమనేదే లేదనీ, వైఎస్ అంటేనే కాంగ్రెస్ అని అన్నారు. అంతేతప్ప కాంగ్రెస్ వర్గమంటూ ప్రత్యేకంగా ఏమీలేదని స్పష్టం చేశారు. నెల్లూరులో కొంతమంది వేషగాళ్లు, ఆటగాళ్లు, వైఎస్ భక్తులుగా నాటకాలాడుతూ వైఎస్ వర్గమని ప్రత్యేకంగా పేర్లు సృష్టిస్తున్నారని విమర్శించారు.

ఇదిలావుండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆనం సోదరులతో టచ్‌లో లేడనీ, మేకపాటి రాజమోహన్ రెడ్డి అనుయాయులను చేరదీస్తూ తమ వైరివర్గాన్ని ప్రోత్సహిస్తారన్న ఆందోళనలో ఆనం బ్రదర్స్ ఉన్నట్లు సమచారం. పైగా సుదీర్ఘ చరిత్ర కల కాంగ్రెస్ పార్టీతో లడాయికి సై అన్నట్లుగా వైఎస్ జగన్ వ్యవహరించడం కూడా ఆనం సోదరులకు ఎంతమాత్రమూ రుచించడం లేదని భోగట్టా. వీటి దృష్ట్యానే జగన్‌ను వదిలి కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు.

సర్కారును అస్థితరపరిచేందుకు కుట్ర: గోనే ప్రకాశ రావు

రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కె.రోశయ్య సర్కారును అస్థిర పరిచేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది ఎంపీలు కుట్ర పన్నుతున్నారని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు ఆరోపించారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో సీఎల్పీ కార్యాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు పోవడం వల్లే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్నారు. 

అక్కడకు వెళ్లిన ఎంపీలు శాంతియుతంగా ప్రవర్తించకుండా విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగడం వల్లే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్నారు. సజావుగా సాగుతున్న రోశయ్య సర్కారుకు అడ్డంకులు సృష్టించి అస్థిర పరిచాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే వారు ఇలా నడుచుకున్నారన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు ఆయన తెలిపారు. 

ఇకపోతే.. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌‍ను పదవి నుంచి తొలగించే అధికారం ముఖ్యమంత్రికి ఉందన్నారు. అందువల్ల ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని తొలగించాలని తెలంగాణ ఎంపీలు డిమాండ్ చేసివుంటే బాగుండేదన్నారు. అంతేకానీ విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవడం భావ్యం కాదన్నారు. 

నెల్లూరులో దివంగత నేత వైఎస్ విగ్రహ ప్రతిష్టను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య మెప్పు పొందేందుకే వారు ఇలా వ్యవహరిస్తున్నారని గోనె ప్రకాష్ రావు ఆరోపించారు.

దేశంలో ఏ శక్తితోనైనా పోరాడుతా: అధిష్టానానికి జగన్ సవాల్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్వరానికి మరింత పదును పెంచుతున్నారు. నేరుగా అధిష్టానంపై బాణాలు వదిలేందుకు సిద్ధపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో తలపెట్టిన ఓదార్పులో జగన్ సంచలన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ మాట్లాడుతూ.. తన తండ్రి వైఎస్సార్ ఆశీస్సులు, ప్రజల బలం తనకు ఉన్నంతవరకూ ఎవరూ తనను ఒంటరివాడిని చేయలేవన్నారు. అంతటితో ఊరుకోకుండా ఈ బలంతోనే దేశంలో ఎంతటి శక్తినైనా ఎదుర్కొని పోరాడుతానని అన్నారు.

అయినా 36 ఏళ్ల తనను ఢీకొనేందుకు అన్ని శక్తులు ఏకమవడం అవసరమా..? అంటూ ప్రశ్నించారు. తన తండ్రి మరణవార్త విని తట్టుకోలేక మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించడం తప్పా..? అని ప్రశ్నించారు. రాజకీయాలు గురించి మాట్లాడితే తప్పంటారు.. మాట్లాడకపోతే మాట్లాడలేదంటారని అన్నారు.

గత పది నెలలుగా తనపై ఏమేమి జరుగుతున్నాయో ప్రజలకు తెలుసని అన్నారు. చంద్రబాబు, రామోజీరావు వంటి వారు తనపై ఎన్ని ఎత్తులు వేసినా ఏమీ చేయలేరని అన్నారు.

Sunday, September 5, 2010

వైఎస్ అవినీతి గురించి మాట్లాడే మగాడివా: రఘువీరా

హిందూపురం,సెప్టెంబర్ 5 : నిరుపేదల కోసం ఎన్నో పథకాలు అమలు పరిచి, వారి గుండెల్లో గూడుకుట్టుకున్న వైఎస్ అవినీతిపరుడంటూ మాట్లాడే అంతటి మగాడివా.. అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడునుద్దేశించి వ్యవసాయశాఖా మంత్రి రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఆదివారం అనంతపురం జిల్లా హిందూపురంలో మునిసిపల్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

తాము లబ్ది పొందామని బహిరంగంగా మునిసిపల్ ఉద్యోగులు ప్రకటించుకునే విధంగా వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు జరుపడం అభినందనీయమన్నారు. జనం తమ ఇష్టమైన నాయకుడిగా భావించి ప్రాంతాల వారిగా పట్టణాల వారిగా వైఎస్ఆర్ విగ్రహాలను ప్రతిష్ఠ చేసుకుంటుంటే చంద్రబాబుకు ఎందుకంత మంట అంటూ విరుచుకుపడ్డారు. అవును లక్ష విగ్రహాలు ఏర్పాటు చేస్తాం ఏమి చేస్తావో చూస్తామని శపథం చేశారు.

హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడటం కాదు చేతనైతే జనం మధ్యకు వచ్చి ఇదే మాట ప్రకటిస్తే ఒళ్ళు హూనం చేస్తారని హెచ్చరించారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయాలలోకి వచ్చిన చంద్రబాబు చివరకు ఆయన పేరు లేకుండా చూడాలని ప్రయత్నించారని విమర్శించారు. మీరు ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టుకుంటామంటే మేము వ్యతిరేకించేవారమా అని ప్రశ్నించారు. బతికి ఉన్నా నీజీవితం వ్యర్థమన్నారు. నీ ఒళ్ళంతా కుళ్ళిపోయిందన్నారు.

ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళ పాలనలో ఎవరికి సాయం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రూపాయల బియ్యం మార్చావు, మద్యపానం, ఉచితవిద్యుత్ పథకాలను పక్కదారి పట్టించిన వాడివి కావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఆరంభ మయ్యాయని, ఇక ఎదురులేదని భావిస్తున్నావా.. అటువంటిదేమీ జరుగదు.. ఏక్షణంలోనైనా ఒక్కటవుతామని పరోక్షంగా జగన్ గురించి ప్రస్తావించారు. నీ సినిమా అయిపోయింది. ఇక నీవు కుప్పంలో కూడా గెలువలేవని సవాల్ విసిరారు. .

ఆంధ్రావాళ్లు గాజులు తొడుక్కొని లేరు!: ఎంపీ రాయపాటి

చక్కగా ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేందుకు వెళ్లిన అభ్యర్ధులపైనా, పరీక్షా కేంద్రాలపైన దౌర్జాన్యాలకు పూనుకోవడం చాలా అన్యాయం..దుర్మార్గం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రత్యేక ఏపీపీఎస్సీ పెట్టుకుని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు...అంతేగానీ ఇలా పదేపదే దౌర్జన్యాలకు పాల్పడితే మాత్రం సహించేది లేదు..ఆంధ్రావాళ్లేమీ గాజులు తొడుక్కొని లేరని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. గ్రూప్-1 పరీక్షా కేంద్రాలపై తెలంగాణలో పలుచోట్ల దాడులకు పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దురాగతాలకు టీఆర్ఎస్సే కారణమని ధ్వజమెత్తారు. కుళ్లు, స్వార్ధ రాజకీయాల కోసం టీఆర్ఎస్ యువత భవిష్యత్తును బలిపెడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

యువతను ప్రోత్సహించి వారిచేత అరాచకాలను చేయిస్తుందని ఆందోళన చెందారు. తెలంగాణ నాయకులు మొదటి నుంచి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నందునే ప్రభుత్వం ఇలాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించలేక పోతుందని చెప్పారు. చంద్రబాబు, వైఎస్‌ల నుంచి నేటి ముఖ్యమంత్రి రోశయ్య వరకు అందరినీ తెలంగాణ నేతలు బ్లాక్ మెయిలింగ్ చేస్తూ వచ్చారని ఆరోపించారు.

ప్రస్తుతానికి తాము చాలా సంయమనం పాటిస్తూ మౌనం వహిస్తున్నామన్నారు. అంతమాత్రాన తమను తక్కువ అంచనా వేయొద్దన్నారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతాం...ఏం చేయాలో అదే చేస్తామని రాయపాటి ఆగ్రహంగా అన్నారు. ఇక జగన్ ఓదార్పు యాత్రపై మీ వైఖరి ఏమిటని ప్రశ్నించగా హైకమాండ్ నిర్ణయం ప్రకారమే తాము నడుచుకుంటామని, తమకొక ప్రత్యేక పం«థా అంటూ ఏదీలేదని అన్నారు. జగన్ గుంటూరు జిల్లా యాత్ర గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.

విద్యార్థుల జీవితాలో చెలగాటమాడొద్దు: ఎంపీ లగడపాటి





ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని వంకగా చూపి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హితవు పలికారు. గ్రూప్-1 పరీక్షలను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు చేసిన యత్నాలను ఆయన ఖండించారు. 
దీనిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఏపీపీఎస్సీ పోస్టుల్లో 42 శాతం వాటా కేటాయించడం అసాధ్యమన్నారు. దీనికి రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉందన్నారు. ఈ విషయం తెలిసిన కొంతమంది రాజకీయ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను పావులుగా వాడుకుంటూ.. వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. 
ప్రధానంగా, ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అవినీతిపరుడని, ఆయనను తక్షణం తప్పించాలని డిమాండ్ చేయడం తగదన్నారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏయేడాది ఫిబ్రవరితో ముగుస్తుందన్నారు. ముఖ్యంగా, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ అనంతరం ఆయన రిటైర్ అవుతారని లగడపాటి గుర్తు చేశారు.

తెరాస నేతలు కుక్కలతో సమానం: ఎమ్మెల్యే శంకర్ రావు

తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీరితో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చేతులు కలపడాన్ని ఆయన తప్పుబట్టారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెరాస నేతలను కుక్కలతో పోల్చారు. 

ఈ సందర్భంగా ఆయన తెరాస నేతలను కుక్కలతో పోల్చుతూ.. ఒక సామెతను గుర్తు చేశారు. "దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి" అనే సామెత తెరాస నేతలకు అచ్చుగుద్దినట్టు సరిపోతుందన్నారు. ఏపీపీఎస్సీ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ ఎపుడో విడుదలైతే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

గ్రూప్-1 పోస్టుల్లో 42 శాతం వాటాను కేటాయించాలని కేవలం ఐదారు రోజులుగానే డిమాండ్ చేశారని, అంతకుముందు వీరంతా ఏం చేస్తున్నారన్నారు. పరీక్షా తేదీని దగ్గర పడిన తర్వాతే వారికి ఈ విషయం గుర్తుకు వచ్చిందా అని శంకర్ రావు ప్రశ్నించారు. 

ఇలాంటి తెరాస నేతలతో తమ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు చేతులు కలపడం దుదృష్టకరమన్నారు. అయితే, శంకర్ రావు వ్యాఖ్యలను కొంతమంది కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. తాము విద్యార్థులకు మాత్రమే సంఘీభావం ప్రకటించామన్నారు

Friday, September 3, 2010

ప్రకాశం జిల్లా ఓదార్పు


జన హృదయ నేత వైఎస్సార్ మృతిని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను పరామర్శించడానికి వై.ఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో జరుగనుంది. తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి శుక్రవారం ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు ప్రయాణమయ్యారు. 
అంతకుముందు జగన్ వైఎస్సార్ ఘాట్‌లో తండ్రికి నివాళులు అర్పించారు. ప్రకాశం జిల్లాలో నేటి నుంచి పదిరోజుల పాటు ఈ యాత్ర జరుగనుంది. గిద్దలూరు నుంచి పది గంటలకు ఆరంభమయ్యే ఈ యాత్రకు జగన్ వర్గం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలిరోజు నాలుగు కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.
ఇదిలా ఉంటే.. ఓదార్పు యాత్రను ఆపేందుకు జగన్ ససేమిరా అన్నారు. అధిష్టానం ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని సైతం జగన్ కాదన్నారు. ఓదార్పును ఆపేందుకు అధిష్టానం దూతగా ఇడుపలపాయకు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ మాటలను కూడా జగన్ తోసిపుచ్చారు.
శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ప్రారంభించి తీరుతానని మొయిలీతో జగన్ స్పష్టం చేశారు. మాట తప్పడం.. మడమ తిప్పడం తమ ఇంటా వంటా లేదంటూ జగన్ తెగేసి చెప్పినట్లు సమాచారం

Thursday, September 2, 2010

ప్రజలు తిరగబడితే అధిష్టానం మటాష్: ఎమ్మెల్యే ఆది

రాష్ట్ర ప్రజలు తిరగబడితే అధిష్టానం నామరూపాలు లేకుండా పోతుందని జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. ప్రజాభిమానం ముందు అధిష్టానం కూడా బలాదూరేనని ఆయన తేల్చి చెప్పారు. అందువల్ల వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందేనన్నారు. 

వైఎస్ఆర్ ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ మృతి చెంది యేడాది గడుస్తున్నా ఆయనపై వున్న అభిమానం నానాటికీ పెరుగుతోందన్నారు. 

దీన్ని అధిష్టానం ఇప్పటికైనా గుర్తించాలన్నారు. లేనిపక్షంలో ప్రజలతో పాటు.. పార్టీలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని జగన్‌కు తగిన న్యాయం చేయాలన్నారు.

మాటతప్పని.. మడమతిప్పని మహానేత వైఎస్: జేసీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిపై సీనియర్ నేత, మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. మాటతప్పని, మడమతిప్పని మహానేత వైఎస్ అని జేసీ కొనియాడారు, వైఎస్ మొదటి వర్థంతి వేడుకలను పురస్కరించుకుని గురువారం సీఎల్పీ కార్యాలయంలో వైఎస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందించి పక్కా ప్రణాళికతో అమలు చేశారన్నారు. అందువల్లే ఆయన పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. ప్రధానంగా ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే మనస్తత్వం వైఎస్‌ సొంతమన్నారు. అందువల్లే ఆయన జన హృదయాల్లో చెరగని ముద్రవేసుకుని శాశ్వితంగా నిలిచి పోయారన్నారు.

నేడు జనహృదయ నేత వైఎస్ఆర్ మొదటి వర్థంతి

ప్రజాహృదయనేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రథమ వర్థంతి గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. 2009 సెప్టెంబర్‌ రెండో తేదీన హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ఆర్‌ దుర్మరణం చెందిన విషయం తెల్సిందే. ఆయన ప్రథమ వర్థంతి సందర్భంగా గురువారం కడప జిల్లా ఇడుపులపాయలో నివాళులర్పించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర, కేంద్ర మంత్రులు హాజరవుతారు. కేంద్రం తరపున కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ హాజరై నివాళులర్పిస్తారు. అదేవిధంగా వైఎస్‌ తనయుడు జగన్‌ ప్రత్యేకంగా నివాళులర్పించనున్నారు. సమాచారశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలోనూ ప్రభుత్వం వైఎస్‌కు ఘన నివాళులర్పించేలా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంది. 

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సాయంత్రం సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. వర్థంతి కార్యక్రమాలు జిల్లాల్లోనూ నిర్వహించాలని డీసీసీ, సీసీసీ కమిటీలకు ఆదేశాలు జారీ చేసినట్లు పీసీసీ నేతలు తెలిపారు. 

ఇందులో మంత్రులతో పాటు జిల్లా కాంగ్రెస్‌నేతలు పాల్గొంటారని చెప్పారు. ఇదిలావుండగా రాజశేఖరరెడ్డికి ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ బుధవారమే ఇడుపులపాయలో నివాళులర్పించారు. ఆమె వెంట కుమార్తె షర్మిల, కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

వైఎస్సార్ వర్థంతి: ముఖ్యమంత్రి రోశయ్య కన్నీళ్లు

దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధమ వర్థంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. నల్లకాల్వ వద్ద వైఎస్ వర్థంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రోశయ్య పాల్గొనవలసి ఉండగా అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయారు. 

ఆయన తరపును మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు మంత్రులు దానం నాగేందర్, సబితా ఇంద్రారెడ్డి ఆయన వద్దకు వెళ్లారు. 

మంత్రులతో రోశయ్య మాట్లాడుతూ... వైఎస్ వర్థంతి వేడుకల్లో పాల్గొనలేక పోయినందుకు ఎంతో బాధగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ హఠత్పరిణామంతో మంత్రి దానం సీఎంను ఓదార్చారు. ముఖ్యమంత్రి అనారోగ్యం కారణంగా రేపు జరగాల్సిన పునరంకిత సభను రద్దు చేసుకున్నట్లు దానం నాగేందర్ వెల్లడించారు.

Wednesday, September 1, 2010

వైఎస్ బతికి ఉంటే ఎంతో సంతోషించేవారు: మన్మోహన్

తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచే పనులకు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కృషి ఫలితంగా ఈ రోజున ఇక్కడ రెండు ప్రాజెక్టులకు శంకుస్థాన చేయడం జరిగిందన్నారు. అందులో ఒకటి మన్నవరంలో ఎల్టీపీసీ-భెల్ విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టు కాగా, రెండోది తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం పనుల ప్రారంభమన్నారు.

ఈ రోజున దివంగత నేత వైఎస్ బతికి వుంటే ఎంతో సంతోషించేవారన్నారు. సెప్టెంబరు రెండో తేదీన రాజశేఖర్‌ రెడ్డి మొదటి వర్థంతిని గుర్తు చేసిన ప్రధాని.. ఈ సందర్భంగా ముందుగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి దేశంలో ఉన్న అతిగొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒకటన్నారు. ఇక్కడకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వస్తుంటారన్నారు. అందువల్లే ఇక్కడ అంతర్జాతీ టెర్మినల్ నిర్మించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిపారు.

శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించడం ఎంతో సంతోషించదగిన విషయంగా ప్రధాని మన్మోహన్‌ అన్నారు. కాగా, తిరుపతి విమానాశ్రయ అభివృద్ధికి ఈ ఏడాది రూ.174 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందని ఆయన గుర్తు చేశారు.

అంతకుముందు ముఖ్యమంత్రి కె.రోశయ్య సందేశాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రఫుల్ పటేల్, వీరప్ప మొయిలీ, వనబాక లక్ష్మి, విలాస్ రావ్ దేశ్‌ముఖ్, సుషీల్ కుమార్ షిండే, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

వైఎస్ లేని ఏడాది పాలనలో... ఆంధ్ర రాజకీయాలు



అపర భగీరథునిగా, పేదలపాలిట పెన్నిధిగా, రైతుజన బాంధవునిగా జన హృదయాలలో నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన రాష్ట్రాన్ని వీడి ఏడాది గడిచింది. అయినా ఆయన జ్ఞాపకాలను మాత్రం ప్రజలు వీడలేకపోతున్నారు. ఆయన లేని లోటును తీర్చే శక్తి ఏ నాయకునికీ లేదంటే వైఎస్సార్ ప్రజల హృదయానికి ఎంత చేరువయ్యారో అర్థమవుతుంది. 
ఆయన గతించిన రెండు నెలలకే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పుట్టింది. ఆ వెంటనే సమైక్యాంధ్ర ఉద్భవించింది. ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను బలి పెట్టారు. తీరని శోకం మిగిల్చారు. మరోవైపు ప్రకృతి ప్రకోపించింది. అభివృద్ధిలో అగ్రపథాన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా అధఃపాతాళానికి దిగజారింది. 
అన్నిటినీ ఒక దారిలో నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నా వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపించింది ఈ ఏడాది కాలంలో. అటువంటి జనరంజక పాలనను అందించే నేతను కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిలోనూ చూడలేకపోతోందంటే ఆయన శక్తి ఎంతటితో అర్థమవుతుంది. 
గత ఏడాది సెప్టెంబరు 2న వైఎస్సార్ ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో సహా ఇద్దరు పైలెట్లు కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగి రాని లోకాలకెళ్లారు. ఆయన మరణం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని సృష్టించింది. పదవిలో ఉన్నప్పుడే ఓ ప్రమాదంలో మరణించిన తొలి ముఖ్యమంత్రి వైఎస్సార్. తన హయాంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా రెండోసారి అధికారాన్ని తెచ్చిపెట్టిన నాయకుడు. అయితే అధికారం చేపట్టి నాలుగు నెలలు కూడా తిరగక ముందే మరణించడం ప్రజలను శోక సముద్రంలో ముంచింది. 
ఈ దశలో సీనియర్ నాయకుడుగా, ఆర్థికవేత్తగా పేరుగాంచిన రోశయ్యను ముఖ్యమంత్రిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్గానికి రుచించలేదు. తండ్రి వారసత్వంగా ఆయన కుమారునికే ముఖ్యమంత్రి పదవి దక్కాలని స్వయంగా సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరిణామంతో అధిష్టానం నివ్వెరపోయింది. 
ఇదిలావుండగానే జగన్ సొంత పార్టీ పాలనను మెల్లగా తూర్పార బట్టడం మొదలుపెట్టారు. వైఎస్ పథకాలు అమలు తీరుపై ధ్వజమెత్తారు. త్వరలో స్వర్ణయుగం వస్తుందని పరోక్షంగా రోశయ్య సర్కారుకు పొగ పెట్టారు. అలా వైఎస్ వర్గం, రోశయ్య వర్గంగా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. కాకపోతే పార్టీలోనే ఉంటూ హైకమాండ్ మాటను ధిక్కరిస్తూ ముందుకు వెళుతోంది జగన్ వర్గం. 
తన తండ్రి మరణ వార్త విని తనువు చాలించిన వ్యక్తుల కుటుంబాలను ఓదార్చాలన్న ధ్యేయంతో జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర వివాదాస్పదమైంది. ఈ ఓదార్పులో కుటుంబాలను ఓదార్చే విషయం ఎలాగున్నా, జగన్ తన స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని అధిష్టానం ఓ అంచనాకు వచ్చింది. 
పార్టీని, అధిష్టానాన్ని ఖాతరు చేయకుండా తన తండ్రి తన ఆస్తేననీ, ఆయన సాధించి తెచ్చిన సీఎం పదవీ తనకే కావాలన్న రీతిలో జగన్ ప్రవర్తన ఉంటోందని పలువురు సీనియర్ నాయకులు అధిష్టానం దృష్టికి పదేపదే తీసుకవెళ్లారు. దీతో కాంగ్రెస్ అధిష్టానం జగన్ ను పిలిచి ఓదార్పును వాయిదా వేసుకోవలసిందిగా సూచన చేసింది. అధిష్టానం మాటలను పట్టించుకోని జగన్ ఓ బహిరంగ లేఖ రాసి ఉత్తరాంధ్ర ఓదార్పుకు బయలుదేరారు. 
మొన్నటివరకూ ఏమీ పట్టనట్లు ఉన్న అధిష్టానం జగన్ వైఖరిపై దృష్టి సారించి రంగంలోకి దిగింది. వైఎస్ మరణవార్త విని తట్టుకోలేక తనువు చాలించిన వ్యక్తుల కుటుంబాలను తాము ఓదార్చుతున్నట్లు ప్రకటించింది. ఆర్థిక సాయం లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఓదార్పు అంటే డబ్బు ఇవ్వడమే కాదనీ, కన్నీళ్లు తుడవడమని అధిష్టానానికి పాఠాలు చెప్పారు జగన్. 
ఇవన్నీ ఇలావుంటే తెలంగాణా సమస్యను తెరాస నిత్యం రగిల్చుతూనే ఉంటోంది. రాష్ట్రంలో ఏమూల ఏ చిన్న అవకతవక జరిగినా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అక్కడ ప్రత్యక్షమై అధికార పక్షాన్ని తూర్పారబడుతున్నారు. ఇక పీఆర్పీ స్నేహంగా ఉంటున్నా అంటూనే వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇలా ఏ పార్టీకాపార్టీ ముఖ్యమంత్రి రోశయ్య కంటిపై కునుకులేకుండా చేస్తున్నారు. 
వీరందరూ ఒక ఎత్తైతే వైఎస్ జగన్ ఓదార్పు రోశయ్యకు పెద్ద తలనొప్పిగా మారింది. తనపై ప్రత్యక్షంగా మాటల యుద్ధాన్ని చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా అంతా అధిష్టానమే చూసుకుంటుందని ఓర్పుగా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు రాజకీయ కురువృద్ధుడు ముఖ్యమంత్రి రోశయ్య.
మొత్తమ్మీద వైఎస్సార్ లేని ఏడాది కాలం అనేక అల్లర్లు, ఎన్నో రాజకీయ ఎత్తులు, మరెన్నో అవినీతి కుంభకోణాలతో 
సాగింది. మరి నెక్ట్స్ ఏంటో.???
                                                                                                                                                                        

అంతా వైఎస్సార్ క్రెడిట్టే: మన్నవరంలో మన్మోహనాస్త్రం!

ఒక రోజు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కొనియాడారు. మన్నవరం ప్రాజెక్టు చిత్తూరు జిల్లాలో నెలకొల్పడానికి వైఎస్సార్ కారణమని చెప్పుకొచ్చారు. ఆయన గట్టిపట్టుదలతో కృషి చేయకుంటే ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కేది కాదనే భావన వచ్చేలా సింగ్ వ్యాఖ్యానించారు. 

తన ప్రసంగం ఆరంభం నుంచే వైఎస్‌పై పొగడ్తల జల్లు కురిపించారు. అలాగే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రులు సుషీల్ కుమార్ షిండే, విలాస్ రావ్ దేశ్‌ముఖ్‌ (కాంగ్రెస్)లు కూడా వైఎస్ కృషిని కొనియాడారు. తామిద్దరం మహారాష్ట్రకు చెందిన మంత్రులమైనప్పటికీ.. ప్రాజెక్టును తమకు దక్కనీయకుండా వైఎస్ చేశారని చమత్కరించారు. 

అయితే, దేశ ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్సార్‌ను ఆకాశానికి ఎత్తేయడమే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ప్రస్తుతం వైఎస్ హఠాన్మరణం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజుకో రీతిలో మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ తనయుడు, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ తన పంథాలో ముందుకు సాగుతున్నారు. 

వైఎస్ తర్వాత స్థాయిలో ప్రజాదారణను సొంతం చేసుకోవడమే కాకుండా తాను అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే ధోరణిని కనబరుస్తున్నారు. ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ. ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. 

ఈ నేపథ్యంలో వైఎస్‌ను పార్టీ ఆస్తిగా కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఇపుడు ప్రధాని నోటి వెంట వైఎస్‌ను ప్రస్తుతిస్తూ వ్యాఖ్యలు రావడం కూడా వైఎస్ అభిమానులను ఎంతో ఆనందానికి లోను చేశాయి. మన్నవరం ప్రాజెక్టు దక్కడానికి వైఎస్సే కారణమని ప్రధాని చెప్పారు. 

అంతేకాకుండా, వైఎస్‌ను కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నేతగా చూసిందని, ఆయన చెప్పినట్టుగా తాము నడుచుకున్నామని ప్రధాని తన మాటల ద్వారా చెప్పారు. తద్వారా వైఎస్ పట్ల, ఆయన కుటుంబం పట్ల పార్టీ వివక్ష చూపిస్తుందని జరుగుతున్న ప్రచారానికి తెరదించేలా మన్మోహనాస్త్రాన్ని ఈ రాజకీయ ఆర్థికవేత్త సంధించి కాంగ్రెస్ శ్రేణులకు,  వైఎస్ అభిమానులకు బలమైన సందేశాన్ని పంపడంలో సఫలీకృతులయ్యారు.