Recent Posts

Best Blogger TipsSnow Fall Blog Gadget

Thursday, June 16, 2011

చీకట్లో చందమామ, శతాబ్దిలోనే సుదీర్ఘ చంద్రగ్రహణం

నిండు పున్నమి చంద్రుడు చీకట్లో చిక్కుకున్నాడు. భూమి నీడ చంద్రుణ్ణి పూర్తిగా కప్పేసింది. శతాబ్దిలోనే అత్యంత సుదీర్ఘ చంద్రగ్రహణాన్ని బుధవారం దేశవ్యాప్తంగా జనం తిలకించారు. ధవళకాంతులు వెదజల్లే చంద్రుడు, గ్రహణం ప్రారంభమవుతున్న సమయంలో ఎరబ్రడ్డాడు. క్రమక్రమంగా క్షీణిస్తూ చీకటి చాటున పూర్తిగా అదృశ్యమయ్యాడు. చంద్రుడు పూర్తిగా చీకట్లో చిక్కుకుని ఉన్న సమయం వంద నిమిషాలు.

దశాబ్ది కిందట 2000 జూలైలో ఇంతకంటే ఎక్కువసేపు సంపూర్ణ గ్రహణం నిలిచింది. మళ్లీ ఇలాంటి గ్రహణం 2141 సంవత్సరంలో మాత్రమే సంభవించనుంది. చంద్రగ్రహణం బుధవారం రాత్రి భారతీయ కాలమానం ప్రకారం 11.54.34 గంటలకు ప్రారంభమైంది. వేకువ జామున 4.30.45 గంటలకు గ్రహణం పూర్తిగా తొలగింది. అర్ధరాత్రి 12.52.30 గంటల నుంచి వేకువ జామున 2.32.54 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించింది.

అంటే, దాదాపు వంద నిమిషాలు చంద్రుడు పూర్తిగా చీకట్లోనే చిక్కుకున్నట్లు ఢిల్లీలోని నెహ్రూ ప్లానెటోరియం డెరైక్టర్ ఎన్.రత్నశ్రీ చెప్పారు. సూర్యునికి, చంద్రునికి మధ్యకు భూమి రావడంతో ఈ గ్రహణం ఏర్పడింది. ఆఫ్రికా, మధ్య ఆసియా, పశ్చిమాసియా, పశ్చిమ ఆస్ట్రేలియా, తూర్పు బ్రెజిల్, ఉరుగ్వే, అర్జెంటీనా ప్రాంతాల వారు సైతం ఈ గ్రహణాన్ని పూర్తిగా తిలకించగలిగారు.